బలవంతంగా చేపట్టబోం

10 Jan, 2016 01:03 IST|Sakshi
బలవంతంగా చేపట్టబోం

♦ అయోధ్యలో రామ మందిరంపై సుబ్రమణ్యం స్వామి
♦ ఢిల్లీ వర్సిటీ సదస్సులో ప్రసంగం
 
 న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో పెల్లుబికిన నిరసనలను లెక్కచేయకుండా రామ మందిర నిర్మాణం అంశంపై జరిగిన సదస్సులో బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ప్రసంగించారు. మన సంప్రదాయాన్ని పునరుద్ధరించాలంటే అయోధ్యలో  మందిర నిర్మాణం అవసరమని చెప్పారు. ‘మందిర నిర్మాణాన్ని బలవంతంగా చేపట్టబోం, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించబోం. దీనిపై కోర్టులో నెగ్గుతామన్న పూర్తి విశ్వాసం మాకుంది’ అని స్పష్టంచేశారు.

ఢిల్లీ యూనివర్సిటీలో ‘రామజన్మభూమి’ అంశంపై శనివారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ఆయన మాట్లాడారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పూర్తి మద్దతిస్తామని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 40 వేలకుపైగా ఆలయాలను ధ్వంసం చేశారని, అయితే వాటన్నింటినీ పునర్‌నిర్మించాలని తాము అడగడం లేదని, వాటిలో మూడు ఆలయాలైన రామ జన్మభూమి, మథురలో కృష్ణుడి ఆలయం, కాశీ విశ్వనాథ్ మందిరాల విషయంలో రాజీపడబోమని సుబ్రమణ్యం స్వామి అన్నారు. వివాదాస్పద భూమిలో రామాలయాన్ని నిర్మించాలని, ముస్లింలకు మసీదు కోసం సరయు తీరంలో స్థలం కేటాయిస్తారని చెప్పారు. వర్సిటీ క్యాంపస్‌లో ఈ సదస్సు నిర్వహించడాన్ని ఎన్‌ఎస్‌యుఐ, తదితర విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నిరసన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టుచేశారు.

మరిన్ని వార్తలు