జైట్లీకి ఎకానమీ గురించి ఏమీ తెలీదు : స్వామి

1 Apr, 2019 13:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి ఆర్థిక వ్యవస్థ గురించి ఏమీ తెలియదని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. గత ఐదేళ్లలో చేపట్టిన నిర్ధిష్ట ఆర్థిక విధానాలు, నిర్ణయాలు తనను మెప్పించలేదని స్పష్టం చేశారు. నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా, దాన్ని అమలుపరిచిన తీరు సరిగా లేదని పెదవివిరిచారు.

జీఎస్టీ అమల్లో ఉన్నా ఇప్పటికీ చాలా పన్నులున్నాయని, వాటిపై స్పష్టత కొరవడిందని అన్నారు. జైట్లీకి ఎకనమిక్స్‌ అంటే తెలియదని మండిపడ్డారు. ఆర్థిక మంత్రితో తనకున్న అనుబంధం గురించి  సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్రహ్మణ్య స్వామిని అడగ్గా.. జైట్లీ తనకు తెలియదంటూ అసలు జైట్లీ, చిదంబరంలు ఆర్ధికవేత్తలు కాదని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ గురించి తెలిసిన మన్మోహన్‌ సింగ్‌ మాత్రం ఆర్థిక మం‍త్రిగా పనిచేశారని, ఎకనమిక్స్‌ తెలియకుండా ఆర్థిక మంత్రులు అయిన వాళ్లున్నారని జైట్లీ, చిదంబరంలను ఉద్దేశించి పేర్కొన్నారు.

ఇక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ తిరిగి అధికార పగ్గాలు చేపడతారని సుబ్రహ్మణ్య స్వామి ధీమా వ్యక్తం చేశారు. మోదీ బ్రాండ్‌ కంటే తాము నమ్మే హిందుత్వ, జాతీయతావాదం వంటి అంశాలే బీజేపీని విజయతీరాలకు చేర్చుతాయని  చెప్పుకొచ్చారు. 2014లోనూ మోదీ బ్రాండ్‌ లేదని, అది కేవలం మీడియా సృష్టేనని వ్యాఖ్యానించారు. కాగా ఏప్రిల్‌ 11 నుంచి ఏడు దశల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. మే 23న ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

మరిన్ని వార్తలు