చనిపోయి 11నెలలైంది..ఆయన బతికొస్తారా?

4 Dec, 2014 18:41 IST|Sakshi
చనిపోయి 11నెలలైంది..ఆయన బతికొస్తారా?

ప్రపంచం ఓవైపు సాంకేతికపరంగా దూసుకెళుతుంటే...మరోవైపు ప్రజలు మాత్రం మూఢనమ్మకాలతో సహ జీవనం చేస్తూనే ఉన్నారు. హర్యానాలో వివాదాస్పద గురువు రాంపాల్ ఘటన మరవక ముందే...పంజాబ్లోని జలంధర్లో మరో సంఘటన చోటుచేసుకుంది. 'స్వామి' భక్తి తారాస్థాయికి చేరటంతో ..చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే జలంధర్లో అశుతోష్ మహారాజ్ అనే స్వామీజీ మరణిస్తే ..భక్తులు మాత్రం ఆయనకి అంత్యక్రియలు చేసేందుకు ఇప్పటికీ ఒప్పుకోవటం లేదు. అది కూడా ఒకరోజు...రెండు రోజులు కాదు ఏకంగా...11నెలలుగా స్వామిజీకి అంతిమ సంస్కారాలు నిర్వహించటం లేదు. స్వామీజీ బతికొస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది జనవరి 29 తేదీన అశుతోష్ మహారాజ్ మరణించగా అప్పటి నుంచి ఆయన మృతదేహాన్ని ఫ్రీజర్లో భద్రపరిచారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో హైకోర్టు జ్యోకం చేసుకుని అశుతోష్ మహారాజ్ ..వైద్యపరంగా మరణించినట్లు ప్రకటించినా భక్తులు మాత్రం తమ పట్టు వీడటం లేదు.

ఎక్కడ స్వామీజీకి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహిస్తారో అనే భయంతో... ఆయన భౌతికకాయానికి కాపలా కాస్తున్నారు. దాంతో అశుతోష్ మహారాజ్ అంత్యక్రియలు డిసెంబర్ 15లోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గత 48 గంటలుగా దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్ ఆశ్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో  పోలీసులు భారీగా మోహరించారు.  కాగా న్యాయస్థానం తీర్పుపై అసంతృప్తిగా ఉన్న కొంతమంది భక్తులు పైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం అవుతున్నారు.

మరిన్ని వార్తలు