నూతన సీఐసీగా సుధీర్‌ భార్గవ

1 Jan, 2019 04:55 IST|Sakshi
సుధీర్‌ భార్గవ

న్యూఢిల్లీ: నూతన ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ)గా కేంద్ర ప్రభుత్వం సుధీర్‌ భార్గవను నియమించింది. ఈయనతో పాటు మరో నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చేపట్టింది. భార్గవ సీఐసీ సమాచార కమిషనర్‌గా చేశారు. ప్రధాన సమాచార కమిషనర్‌తో కలిపి మొత్తం 11 మంది ఉండాల్సిన ఈ కమిషన్‌లో ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన యశ్వర్ధన్‌ కుమార్‌ సిన్హా, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి వనజా ఎన్‌ సర్నా, మాజీ ఐఏఎస్‌ నీరజ్‌ కుమార్‌ గుప్తా, మాజీ లా సెక్రటరీ సురేశ్‌ చంద్రలను సమాచార కమిషనర్లుగా నియమిస్తూ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఈ ఏడాదే ప్రభుత్వోద్యోగులుగా పదవీ విరమణ పొందారు. ఇటీవల ప్రధాన సమాచార కమిషనర్‌ ఆర్‌.కె.మాథుర్‌తో పాటు ముగ్గురు సమాచార కమిషనర్లు శ్రీధర్‌ ఆచార్యులు, యశోవర్ధన్‌ ఆజాద్, అమితవ భట్టాచార్య పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడున్న ఇతర ముగ్గురు కమిషనర్లు వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

నియామకాల్లో పారదర్శకత ఏది?: మాడభూషి
సాక్షి, న్యూఢిల్లీ: సీఐసీ నియామకాల్లో పారదర్శకత పాటించాలని మాజీ సీఐసీ మాడభూషి శ్రీధరాచార్యులు కోరారు. కేవలం పరిపాలన రంగానికి చెందిన అధికారులనే కాకుండా ఇతర రంగాలకు చెందిన వారినీ కమిషనర్లుగా నియమించాలన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఖర్గేకు లేఖలు రాశారు. సీఐసీ సభ్యుల ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత సభ్యులు. సీఐసీ సభ్యుల ఎంపిక సమాచార హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నందునే పలువురు కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యా(పిల్‌)లు దాఖలు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘సీఐసీ కమిషనర్లుగా కేవలం పరిపాలన వర్గాల వారినే ఎందుకు నియమిస్తున్నారు? న్యాయం, సామాజిక సేవ, మీడియా, జర్నలిజం, సైన్స్, టెక్నాలజీ తదితర రంగాల వారినీ  నియమించాలన్న సమాచార హక్కు చట్ట నిబంధనలను ఎందుకు పాటించరు? ఇటీవల నియమించిన నలుగురినీ బ్యూరోక్రాట్ల నుంచే ఎందుకు ఎంపిక చేశారు?’ అని ప్రశ్నించారు. సీఐసీతోపాటు రాష్ట్రాల సమాచార హక్కు కమిషన్‌(ఎస్‌ఐసీ)లలో సకాలంలో నియామకాలు చేపట్టాలన్న నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు.

మరిన్ని వార్తలు