సునంద మృతిపై మళ్లీ వివాదం

3 Jul, 2014 02:52 IST|Sakshi
సునంద మృతిపై మళ్లీ వివాదం

పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుకు ఒత్తిడి వచ్చిందని ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ సుధీర్ ఆరోపణ
*  ఆయన ఆరోపణలకు ఆధారాలు లేవన్న ఎయిమ్స్ ప్రతినిధులు
*    తాజా ఆరోపణలపై తక్షణ నివేదికకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఆదేశం
*   అవసరమైతే, సుధీర్ గుప్తా, శశిథరూర్‌లను ప్రశ్నిస్తామన్న ఢిల్లీ పోలీస్ కమిషనర్
 
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మృతి మళ్లీ వివాదాస్పదంగా మారింది. ఆమెది సహజ మరణమేనంటూ నివేదిక ఇవ్వాలని తమపై ఒత్తిడి జరిగిందని, పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుకోసం ఒత్తిడి చేశారని అఖిల వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా చేసిన తాజా ఆరోపణ సంచలనం రేపింది. సునంద మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన ముగ్గురు సభ్యుల బృందానికి నేతృత్వం వహించిన సుధీర్ గుప్తా చేసిన తాజా ఆరోపణపై తక్షణ నివేదికకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి  హర్షవర్ధన్ ఎయిమ్స్ డెరైక్టర్‌ను ఆదేశించారు.
 
 అయితే, సుధీర్ గుప్తా ఆరోపణలను ఎయిమ్స్ ప్రతినిధులు అమిత్ గుప్తా, నీరజా భాట్లా బుధవారం నిర్ద్వంద్వంగా ఖండించారు. పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుకోసం సుధీర్ గుప్తాపై బయటనుంచి ఒత్తిడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వారు స్పష్టంచేశారు. సర్వీస్‌కు సంబంధించిన అంశంగా సుధీర్ గుప్తా తన ఆరోపణను అఫిడవిట్ రూపంలో  కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)కు నివేదించినట్టు వార్తలు వెలువడిన మరుసటి రోజునే ఎయిమ్స్ ఆయన ఆరోపణలను ఖండించింది. మరో వైపు, మంత్రి హర్షవర్ధన్‌కు కూడా సుధీర్ గుప్తా లేఖ రాశారు. ఫోరెన్సిక్ విభాగం అధిపతి పదవినుంచి తనను తప్పించేందుకు కుట్ర జరిగిందని, సునంద మృతిపై, అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి నిటో తానియా అనుమానాస్పద మృతిపై తానిచ్చిన పోస్ట్‌మార్టమ్ నివేదికలకు ముడిపెడుతూ కుట్రపన్నారని గుప్తా ఆరోపించారు. పోస్ట్ మార్టమ్ విషయంలో వృత్తిపరమైన నిబద్ధతతో, నైతిక బాధ్యతతో తాను వ్యవహరించిన తీరు.. స్వార్థశక్తులకు రుచించలేదని గుప్తా తన లేఖలో ఆరోపించారు. కాగా, తన ఆరోపణలపై బుధవారం మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ విషయమై తాను మీడియాతో మాట్లాడబోనని స్పష్టంచేశారు.
 
 కాగా,..డాక్టర్ గుప్తా ఆరోపణలగురించి తెలియదని, తనవరకూ వచ్చినపుడు ఆయన ఆరోపణలను కూడా పరిశీలిస్తానని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. ఈ కేసులో అవసరమైతే, సుధీర్ గుప్తాను, థరూర్‌ను పోలీసులు ప్రశ్నిస్తారని, డాక్టర్ గుప్తా క్యాట్‌లో దాఖలుచేసినట్టు చెబుతున్న అఫిడవిట్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటామని బస్సీ చెప్పారు.ఇక సునంద అనుమానాస్పద మృతిపై ఒకవైపు పోలీసు దర్యాప్తు కొనసాగుతుండగానే, ఆమె మృతికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై కచ్చితమైన నిర్ధార ణకు రావాలంటూ శశి థరూర్ కూడా కోరారు.
 
 థరూర్ భార్య సునంద గత జనవరిలో, ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన భర్త థరూర్‌కు, పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్‌కు మధ్య సంబంధాలపై సోషల్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేసిన సునంద ,..ఆ మరుసటిరోజునే మరణించ డంతో ఆమె మృతిపై పలు అనుమానాలు తలెత్తాయి. అయితే, మితిమీరిన స్థాయిలో వ్యాధినిరోధక మందులు తీసుకోవడంవల్లనే ఆమె మరణించినట్టు జనవరి 20న ఎయిమ్స్ తన పోస్ట్‌మార్టమ్ నివేదికలో పేర్కొంది. అయితే, ఇంతకాలం మౌనంగా ఉండి, ఇప్పుడు సుధీర్  ఆరోపణలు చేయటం చర్చనీయాంశమైంది. సునంద కేసుపై రాజ్‌నాథ్ కు వివరణ..
 
 సునందా పుష్కర్ మృతిపై ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ సుధీర్ గుప్తా చేసిన తాజా ఆరోపణల నేపథ్యంలో, ఆమె మృతిపై దర్యాప్తుగురించి,  ఢిల్లీపోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించినట్టు తెలిసింది. దర్యాప్తులో ఇప్పటివరకూ బయటపడ్డ అంశాలను, దర్యాప్తు త్వరగా ముగించేందుకు తీసుకున్న చర్యలను కూడా బస్సీ మంత్రికి వివరించినట్టు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు