డబ్బులున్నాయి.. దాచి పెట్టుకోవద్దు: రిజర్వుబ్యాంకు

17 Nov, 2016 16:45 IST|Sakshi
డబ్బులున్నాయి.. దాచి పెట్టుకోవద్దు: రిజర్వుబ్యాంకు
కరెన్సీ నోట్లు లేవేమోనన్న భయంతో అవసరం లేకపోయినా ముందుగానే పెద్దమొత్తంలో డ్రా చేసుకుని నిల్వ చేసుకోవద్దని ప్రజలను రిజర్వు బ్యాంకు కోరింది. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రజలంతా ఒక్కసారిగా బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్దకు చేరి కొత్త నోట్లు, పాత వంద రూపాయల నోట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఈ ప్రకటన చేసింది. బ్యాంకులలో కావల్సినంత డబ్బు ఉందని, అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రజల అవసరాలకు సరిపడ డబ్బులు ఉన్నాయని, రెండు నెలల ముందు నుంచే దీనికి కావల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ వచ్చినందువల్ల సమస్య ఏమీ లేదని మరోసారి స్పష్టం చేసింది. కొత్త 500 రూపాయల నోట్లను ఇవ్వడానికి కూడా వీలుగా ఏటీఎంలను ఇప్పటికే క్యాలిబరేట్ చేశారు. 2000 నోట్లను ఇవ్వడానికి వీలుగా 22,500 ఏటీఎంలను క్యాలిబరేట్ చేశారు. అయినా ఇప్పటికీ డబ్బులున్న ఏటీఎంల వద్ద రష్ ఏమాత్రం తగ్గడం లేదు. 
 
అయితే.. నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వచ్చేవారి సంఖ్య కొంతవరకు తగ్గిందని చెబుతున్నారు. తమ బ్యాంకుకు నగదు మార్పిడి కోసం వచ్చేవాళ్లు గణనీయంగా తగ్గారని ఐసీఐసీఐ బ్యాంకు చైర్మన్ చందా కొచ్చర్ కూడా చెప్పారు. పైపెచ్చు, ఇప్పుడు డబ్బులు విత్‌డ్రా చేసుకునేవారికి, నోట్లు మార్చుకునేవారికి వేలికి ఇంకు పెడుతున్నందున.. మళ్లీ మళ్లీ రావడం తగ్గిందని, దానివల్ల కూడా క్యూలైన్లు కొంతవరకు అదుపులోకి వచ్చాయని చెబుతున్నారు. 
మరిన్ని వార్తలు