విరుగుడు లేకుంటే ప్రాణం పోతుంది..!

9 Jun, 2019 14:44 IST|Sakshi

ప్రాణం పోసే మందులే... శరీరానికి నప్పకపోతే ప్రాణాంతకంగా మారుతాయి. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కొత్తరోగాలకు కారణమవుతాయి. వ్యాక్సిన్లు వేసే ముందు వాటికి విరుగుడు మందును సైతం సిద్ధంగా ఉంచాలన్న విషయాన్ని చాలామంది వైద్యులు పట్టించుకోవడం లేదు. గిరిజన ప్రాంతాల్లో విరుగుడు మందు లేక ప్రాణాలు పోయే ఘటనలు ఎక్కువగా సంభవిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. మందుల వినియోగం, వికటించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

భువనేశ్వర్‌ : ప్రాణాలు పోయాల్సిన మందులు.. ప్రాణాలు తీస్తున్నాయి. కత్తికి రెండువైపులా పదునన్నట్లుగా మారాయి. ఏ మందు ఎప్పుడు ఎవరిపై స్పందిస్తుందో కచ్చితమైన నిర్ధారణ ఇంకా వైద్య శాస్త్రం చేయలేదంటున్నారు వైద్యులు. దీంతో కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లు ఉంది రోగుల పరిస్థితి. మనిషి అన్నాక ఏదో ఒక రోగం రాక తప్పదు. రోగం వచ్చిన తరువాత వైద్యుని ఆశ్రయించి మందులు తీసుకుని వాడడం పరిపాటి. అయితే, ఇక్కడే అసలు సమస్య తలెత్తుతుంది. రోగం తగ్గడానికి వైద్యులు సూచించిన మందులు వేసుకుంటే అవి కొత్త రోగాలకు కారణమవుతూ ప్రాణాలను తోడేస్తున్నాయి. మందులు రియాక్షన్‌ ఇవ్వడంతో వింతరోగాల బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. మెడికల్‌ రియాక్షన్‌ వల్ల కలిగే రోగాలను ముందుగానే గుర్తించకపోతే మరణమే శరణ్యం.

అందుకే వీటి లక్షణాలను  ముందుగానే గుర్తించడం ప్రధానమంటున్నారు వైద్య నిపుణులు. వెంటనే వాడుతున్న డ్రగ్‌ను నిలిపివేయాలని సూచిస్తున్నారు. అయితే, ఏ డ్రగ్‌ రియాక్షన్‌ ఇస్తుందో తెలియని వైద్య ప్రపంచంలో సామాన్యులకే కాదు వైద్యులకు సహితం అవగాహన ఉందా ప్రశ్న తలెత్తుతుంది. ఇది నూటికి నూరు శాతం నిజమనే తేలుతుంది. పోతున్న ప్రాణాలు కూడా వైద్యుల స్థాయిలో నిర్లక్ష్యం వల్లే పోతున్నాయి. అందుకే వైద్యులకు డ్రగ్‌ రియాక్షన్‌పై సంపూర్ణ అవగాహన ఉండాలంటున్నారు ప్రొఫెసర్లు. దీని ద్వారా రియక్షన్‌ వల్ల కలిగే అనర్థాలను కొంత అరికట్టే అవకాశం ఉంటుంది. డ్రగ్‌ రియాక్షన్‌ కేసులపై జరుగుతున్న  మరణాలపైన వైద్య రంగం మరింత పరిశోధన చేయాలి. పెన్సిలిన్‌ లాంటి మందులను ఒక వ్యక్తికి సరిపోతాయో లేదో అని పరిశీలించే వీలు ఎలా ఉందో అలా అన్ని డ్రగ్సుకు పరిశీలించాలి. ఆ వైపుగా వైద్య రంగం ప్రయాణం సాగాలి.

మందు వికటిస్తే ఏం చేయాలి
రోగికి మాత్రలు, వ్యాక్సిలు ఇచ్చిన సమయంలో నూటికి 95 శాతం డ్రగ్‌ రియాక్షన్‌ వచ్చినప్పుడు మొదటగా ప్రథమ చికిత్స చేయడానికి ముందే వాడుతున్న మందుల వినియోగాన్ని నిలిపివేయాలి. మందుల వాడడం వల్ల శరీరంలో మార్పులు వస్తున్న సంగతిని గుర్తించాలి. ఏవైతే మందులు వినియోగించిన సమయంలో డ్రగ్‌ రియాక్షన్‌ జరుగుతుందో దీనికి విరుగుడుగా ఉపయోగించే మందులను కూడా అందుబాటులో పెట్టుకోవాలి. విరుగుడు మందును ఇచ్చిన వెంటనే నిపుణులైన వైద్యుల వద్దకు త్వరగా తీసుకుపోవాలి.

నిబంధనలకు చెల్లుచీటీ...
రోగికి అవసరమైన మందులును వైద్యులు రోగి శరీరంలోకి పంపించే సమయంలో రోగి లక్షణాల్లో మార్పులు సంతరించుకుంటే డ్రగ్‌ రియాక్షన్‌ అయినట్లు గుర్తిస్తారు. పెన్సిలిన్‌ ఇంజక్షన్‌ కొంతమందికి పడదు. అలాగే, న్యూరోబిన్‌ ఇంజక్షన్‌ కొంతమందికి నప్పదు. ఇలా అనేక మందులు వారి శరీర తత్వాలను బట్టి నప్పవు. అయితే, నిపుణులైన వైద్యులు, ఆర్‌ఎంపీ వైద్యులు, మెడికల్‌ షాపుల యజమానులు ఆయా మందులను రోగికి ఇచ్చే ముందు అవి వారికి నప్పుతాయో లేదో పరిశీలించాలి. కొందరు వైద్యులు ఎటువంటి పరీక్షలు చేయకుండా రోగి శరీరంలోకి మందులను ఎక్కించేస్తుండడం సమస్యలను తెస్తోంది. మందు వికటిస్తే  డెకాడ్రాన్, ఎట్రోఫిన్, ఎడ్రనలిన్, డెరి ఫిల్లిన్, ఎవిల్‌ వంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలి. వీటిని వినియోగించడం వల్ల రోగి ప్రాణాపాయ స్థితి నుంచి గట్టేక్కే వీలుంటుంది.

 డ్రగ్‌ రియాక్షన్‌ లక్షణాలు ఇలా...
రోగికి మందులు నప్పనప్పుడు రియాక్షన్‌ తప్పక కనిపిస్తుంది. అలాంటి సమయంలో రోగికి అతిగా ఆవేశం రావడం, శరీరం చెమటలు పట్టడం, మూర్చ వచ్చి కాళ్లు, చేతులు కొట్టుకోవడం, చర్మంపై దురదలు పెట్టడం, శరీరంపై కడతలు రావడం, శరీరం ఎర్రగా కందిపోయినట్లు కావడం, వాంతులు కావడం, స్పృహ తప్పి పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ...
గిరిజన ప్రాంతాల రోగులు ఎక్కువగా డ్రగ్‌ రియాక్షన్‌కు గురౌతుంటారు. గిరిజనులు, కొండశిఖర మారు మూల గ్రామాల ప్రజలు ఎక్కువగా సంచి వైద్యులను ఆశ్రయిస్తుంటారు. వీరు ఒక జబ్బుకు ఇవ్వాల్సిన మందు స్థానంలో వేరే మందును ఇవ్వడం, కాలం చెల్లిన మందులు ఇస్తారు. దీంతో డ్రగ్‌ రియాక్షన్‌ అవుతుంది. వెంటనే విరుగుడు మందులు సంచి వైద్యుల వద్ద ఉండకపోవడంతో దగ్గరలో ఉన్న ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తారు. ఆ రోగి ఆస్పత్రికి చేరేవరకు బ్రతికి ఉంటాడో లేక ప్రాణాలు విడుస్తాడో తెలియని పరిస్థితి. ఇటువంటి ఎన్నో కేసులు గిరిజన ప్రాంతాల్లో బయటపడకుండా మరుగున పడిన సంఘటనలు ఉన్నాయి.

మందులు అందుబాటులో ఉండాలి
రోగి శరీర తత్వాన్ని బట్టి కొన్ని మందులు నప్పవు. రోగాన్ని నయం చేయడానికి అవసరమైన మందులను రోగి శరీరంలోకి పంపిస్తున్న సమయంలో ఒక్కోసారి వికటిస్తాయి. ఇలాంటి సమయంలో విరుగడు మందులు అందుబాటులో ఉంటే రోగికి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. లేదంటే రోగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. సంచి వైద్యులు, మెడికల్‌ షాపుల యజమానులు, గ్రామీణ ప్రాంత వైద్యుల వద్ద యాంటీ డ్రగ్‌ రియాక్షన్‌ మందులు అందుబాటులో ఉంచాలి.
– డాక్టర్‌ జి.నాగభూషణరావు, సూపరింటెండెంట్, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా