ఎన్‌డీఏ పక్షాల ఐక్యతకు పిలుపు..

7 Jun, 2018 18:05 IST|Sakshi
శిరోమణి అకాలీ దళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలు తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి విపక్షాలకు దీటుగా వ్యవహరించాలని శిరోమణి అకాలీ దళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ పిలుపు ఇచ్చారు. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాతో భేటీ అనంతరం బాదల్‌ మీడియాతో మాట్లాడుతూ పాలక పార్టీకి తమ పార్టీ శాశ్వత మిత్రపక్షంగా ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ, అకాలీ దళ్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చిచెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి విపక్షాలపై పోరాడాల్సిన అవసరం ఉందని బాదల్‌ వ్యాఖ్యానించారు.

మరోవైపు సార్వత్రిక ఎన్నికల సన్నాహాల నేపథ్యంలో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా మిత్రపక్షాలతో పాటు పలువురు సెలబ్రిటీలు, ఆయా రంగాల్లో దిగ్గజాలను కలుస్తూ నాలుగేళ్ల మోదీ హయాంలో సాధించిన విజయాలను వివరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా అమిత్‌ షా బుధవారం ముంబయిలో శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ థాక్రేతో భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా థాక్రేను షా కోరారు.

ఇరువురు నేతల మధ్య సమావేశం ఫలవంతమైందని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఉప ఎన్నికల ఫలితాలతో పాటు ప్రభుత్వంపై విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న క్రమంలో బీజేపీ అగ్రనేతల వైఖరిలో మార్పునకు ఈ భేటీలు సంకేతమని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు