‘రిజర్వేషన్లతో దేశానికి కలిగిన ప్రయోజనం ఏంటి?’

1 Oct, 2018 08:55 IST|Sakshi
లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌

రాంచీ : రిజర్వేషన్ల వల్ల దేశానికి ఏమైనా మేలు జరిగిందా, వెనకబడిన వర్గాలు అభివృద్ది సాధించాయా.. అంటూ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నించారు. జార్ఖండ్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ‘లోన్‌ మానథాన్‌’ కార్యక్రమానికి సుమిత్రా మహాజన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సామాజిక సామరస్యాన్ని సాధించడం కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్వాతంత్ర్యనంతరం పదేళ్ల పాటు రిజర్వేషన్లు ఉండాలని భావించారు. విద్యాసంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెనకబడిన వర్గాలవారికి తగు ప్రాధాన్యత కల్పించడం కోసం రిజర్వేషన్లు ఉద్దేశించబడినవి. కానీ అవే రిజర్వేషన్ల వల్ల నేడు ఆయా రంగాల్లో తీవ్ర శూన్యత ఏర్పడింది. కేవలం పదేళ్లు మాత్రమే అనుకున్న రిజర్వేషన్లను ప్రతి పదేళ్లకోసారి పొడిగిస్తూ పోవడం వల్ల దేశానికి ఏమైనా ప్రయోజనం సమకూరిందా? సామాజిక ప్రగతి సాధించాలంటే కావాల్సింది రిజర్వేషన్ల కాలపరిమితిని పొడగించడం కాదు. సామాజిక సామరస్యం సాధించే దిశగా మన ఆలోచనల్ని, చేతల్ని మార్చుకోవాలి. అప్పుడే అంబేద్కర్‌ కలలు కన్న సమాజం సిద్ధిస్తుంద’ని తెలిపారు.

బీజేపీ పార్టీ రిజర్వేషన్లను ముగింపు పలకనున్నదని ఈ ఏడాది ప్రారంభంలో కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఈ ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్‌ పార్టీ కావాలనే తమ ప్రభుత్వం గురించి అసత్య ప్రచారం చేస్తోందని.. బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రకటించారు.

మరిన్ని వార్తలు