పగటిపూట పొయ్యి వెలిగిస్తే చెప్పుదెబ్బలు!

16 Apr, 2016 21:11 IST|Sakshi
పగటిపూట పొయ్యి వెలిగిస్తే చెప్పుదెబ్బలు!

పట్నా: 'ఉదయం తొమ్మిది గంటలు దాటిన తర్వాత పొయ్యి వెలిగించ వద్దు. వెలిగించినవాళ్లకు చెప్పు దెబ్బలతో పాటు జరిమానా వేస్తాం' .. ఇది బిహార్ లోని కొన్ని గ్రామాల్లో వినిపిస్తోన్న దండోరా. రోజురోజుకూ ఎండలు మండిపోతుండటంతో అగ్నిప్రమాదాలను నివారించేందుకు పగటిపూట వంట చేయడానికి వీల్లేదని ఫత్వా జారీచేస్తున్నారు బిహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా అధికారులు! ఆజ్ఞలు అతిక్రమించిన వారికి రూ.1,000 జరిమానా కూడా ఉంటుందని ప్రకటించారు.


రాష్ర్ట విపత్తు నిర్వహణ శాఖ సమాచారం ప్రకారం ఇప్పటివరకు అగ్నిప్రమాదాల మూలంగా 23 మంది పౌరులతో 50 జంతువులు మృత్యువాత పడ్డాయి. ఇల్లు కాలిపోవడంతో 5,742 కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఒక్క పశ్చిమ చంపారన్ జిల్లాలోనే దాదాపు 800 కుటుంబాలు వీధిన పడ్డాయి. ఎక్కువ కుటుంబాలు పూరి గుడిసెల్లో నివాసం ఉంటుండటం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు.

 

లక్ష్మీపూర్, పటిలార్, రత్వాల్, లగునహ, సితాపూర్, అహిర్వలియా గ్రామాలు ఉదయాన్నే వంట పూర్తి చేసుకోవడానికి ముందుకొచ్చాయి. మరికొన్ని గ్రామాలు అసలు భోజనం వండుకోకుండా ఉండేందుకు అంగీకరించాయి. రాత్రుళ్లు ఇళ్లలో వెలిగించే దీపాలను కూడా వాడమని మరికొన్ని గ్రామాలు నిర్ణయం తీసుకున్నాయి. బీహార్ రాష్ర్టంలో ఇప్పటివరకు అధికారికంగా 400 అగ్నిప్రమాదాలు జరిగినట్లు రికార్డుల్లో నమోదు చేశారు.

మరిన్ని వార్తలు