నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: సుధీర్ గుప్తా

4 Jul, 2014 02:39 IST|Sakshi
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: సుధీర్ గుప్తా

సునంద కేసుపై ఎయిమ్స్ ఫోరెన్సిక్ చీఫ్ సుధీర్ గుప్తా
న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య, సునందా పుష్కర్ మృతిపై పోస్ట్ మార్టమ్ నివేదికలో మార్పుచేయాలంటూ తనపై ఒత్తిడి జరిగిందన్న మాటకు తాను కట్టుబడి ఉన్నానని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధిపతి సుధీర్ గుప్తా గురువారం మరోసారి స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను ఎయిమ్స్ ప్రతినిధులు ఖండించిన మరుసటి రోజు పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, పోస్ట్‌మార్టమ్‌పై తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. ‘నేను చెప్పిన మాటలకు కట్టుబడే ఉన్నా. నాపై ఏ ఒత్తిడీ లేదని వారికెలా తెలుసు? అలా వివరణ ఇవ్వడానికి వారెవరు? అలా చెప్పడానికి హడావుడిగా విలేకరుల సమావేశం పెట్టాల్సిన అవసరం ఏమిటి?‘ అంటూ సుధీర్ గుప్తా ప్రశ్నలు సంధించారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంవద్ద మీడియా సమావేశంలో కూడా సుధీర్ గుప్తా ఇదే స్పందన వ్యక్తం చేశారు. సునందా మృతిపైనేకాక ఇతర కేసుల్లోనూ వైద్యసూత్రాలకు అనుగుణంగానే పోస్ట్‌మార్టమ్ నివేదికలను ఖరారు చేశానని, జీవితంలో ఎప్పుడూ ఒత్తిళ్లకూ లొంగలేదని గుప్తా అన్నారు. గతంలో తానిచ్చిన నివేదికలన్నీ సాధికారమైనవేనన్నారు. సుధీర్ గుప్తా రూపొందించిన పోస్ట్‌మార్టమ్ నివేదికలో సునంద రెండు చేతులమీద 12కు పైగా గాయాలున్నట్టు పేర్కొన్నారు. ఆమె మెడపై బలంగా నొక్కినట్టు ఒరిపిడి జరిగినట్టు తెలుస్తోందని వివరించారు. ఎడమ అరచేతిపై లోతైన పంటి గాయం కూడా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. వీటికి సంబంధించిన నమూనాలను భద్రపరిచినట్టు కూడా తెలుస్తోంది. ఈ నివేదిక వ్యవహారం వివాదాస్పదం అవుతుందనే తనపై ఒత్తిడి వచ్చినట్టు గుప్తా ఆరోపించారు.

మరిన్ని వార్తలు