ఆ భూమి తీసుకుంటాం: సున్నీ వక్ఫ్‌బోర్డు

24 Feb, 2020 19:37 IST|Sakshi

లక్నో: అయోధ్య జిల్లాలో మసీదు నిర్మాణం కోసం తమకు కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్లు సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు సోమవారం పేర్కొంది. ఈ స్థలంలో మసీదు నిర్మాణంతో పాటుగా.. ఇండో- ఇస్లామిక్‌ పరిశోధన సంస్థ, ఆస్పత్రి, గ్రంథాలయం నిర్మిస్తామని తెలిపింది. ఈ మేరకు త్వరలోనే మసీదు నిర్మాణానికై ట్రస్టు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సర్వోన్నత న్యాయస్థానం.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ క్రమంలో అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు స్థలం కేటాయించింది.

ఈ క్రమంలో ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలాన్ని తాము స్వీకరిస్తున్నామని సున్నీవక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జుఫర్‌ ఫరూఖీ సోమవారం తెలిపారు. బోర్డు సభ్యులతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘త్వరలోనే ట్రస్టు ఏర్పాటు చేస్తాం. మసీదుకు ఏ పేరు పెట్టాలన్న విషయాన్ని ట్రస్టు నిర్ణయిస్తుంది. బోర్డుతో ఆ విషయాలకు ఎటువంటి సంబంధం ఉండబోదు. మసీదుతో పాటు లైబ్రరీ, పరిశోధన సంస్థ, ఆస్పత్రి.. నిర్మించడంతో పాటుగా.. భూమిని అన్నిరకాలుగా వినియోగించుకుంటాం. స్థానికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మసీదు ఎంత విస్తీర్ణంలో నిర్మించాలో నిర్ణయిస్తారు’’అని పేర్కొన్నారు. కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ట్రస్టును ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద స్థలం సహా మొత్తం 67.703 ఎకరాలను ఈ ట్రస్ట్‌కు బదిలీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.(రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్‌)


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు