-

తీర్పుపై సున్నీ వక్ఫ్‌ బోర్డు కీలక నిర్ణయం

9 Nov, 2019 17:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని సున్నీ వక్ఫ్‌ బోర్డు  ప్రకటించింది. కీలకమైన తీర్పు వెలువడిన అనంతరం రివ్యూ పిటిషన్‌ వేయాలని భావించినా.. తీర్పు సమీక్షించిన తరువాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయట్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సున్నీ వక్ఫ్‌ బోర్డు ప్రతినిధులు ఓ ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని.. ఈ తీర్పుపై చర్చించిన తర్వాతే తదుపరి కార్యాచరణకు సిద్ధవుతామని సున్నీ వక్ఫ్‌ బోర్డు న్యాయవాది జఫర్‌యాబ్‌ జిలానీ తొలుత వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తీర్పు కాపీ పూర్తిగా చదివిన తర్వాతే రివ్యూ పిటిషన్‌ వేయాలో లేదో నిర్ణయించుకుంటామని అన్నారు. ఏఎస్‌ఐ నివేదికలో ముస్లింలకు అనుకూలంగా ఉన్న అంశాలను కోర్టు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీతో చర్చించిన తర్వాతే వారి నిర్ణయం మేరకు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తామని బోర్డు వెల్లడించింది. అయితే తీర్పుపై దాదాపు రెండు గంటల పాటు చర్చించిన కమిటీ సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.

కాగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన రామజన్మభూమి కేసులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం కీలక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్ధలం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు... నిర్మోహి అఖాడా పిటిషన్‌ను సైతం తోసిపుచ్చింది. అదే విధంగా అయోధ్య చట్టం కింద మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేయడంతో పాటుగా. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు (సున్నీ వక్ఫ్‌ బోర్డుకు) ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని (2.77 ఎకరాలు) రామజన్మ న్యాస్‌కే అప్పగించాలని తీర్పు వెలువరించింది.

చదవండి: అయోధ్య తీర్పు: సున్నీ వక్ఫ్‌బోర్డు స్పందన

మరిన్ని వార్తలు