కనువిందు చేసిన జాబిల్లి

1 Feb, 2018 01:34 IST|Sakshi
కోయంబత్తూరు, న్యూయార్క్‌, జకార్తాలో చంద్రగ్రహణం ఇలా..

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ బ్లూ బ్లడ్‌మూన్‌ బుధవారం కనువిందు చేసింది. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలు, రష్యాలోని కొన్ని భాగాల్లో కోట్లాది మంది ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఉత్సాహంగా వీక్షించారు. కాలిఫోర్నియాతోపాటు పశ్చిమ కెనడాలోని ప్రజలు చంద్ర గ్రహణాన్ని పూర్తిగా చూశారని నాసా వెల్లడించింది. దక్షిణ అమెరికా ఖండం, పశ్చిమ యూరప్‌తోపాటు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో సూపర్‌ బ్లూ బ్లడ్‌ మూన్‌ కనిపించలేదు.

ఇటు భారత్‌లోనూ అనేక మంది ప్రజలు చంద్రగ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించేందుకు వివిధ నగరాల్లోని నక్షత్రశాలలకు క్యూ కట్టారు. ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద వేలాది మంది విద్యార్థులు ఖగోళ వింతను చూసేందుకు గుమిగూడారు. దక్షిణ భారతంలోని పలు నగరాల్లోనూ ప్రజలు ఖగోళ వింతను ఆసక్తిగా తిలకించారు. పౌర్ణమినాడు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్‌ అంటారు. అలాగే ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దానిని బ్లూ మూన్‌ అంటారు. చంద్రగ్రహణం నాడు ముదురుఎరుపు రంగులో కనిపించే చంద్రుడిని బ్లడ్‌మూన్‌ అంటారు. బుధవారం ఈ మూడు ఏకకాలంలో ఆవిష్కృతమయ్యాయి.


                 హాంకాంగ్‌లో సాయంత్రంవేళ టెలిస్కోప్‌తో సూపర్‌మూన్‌ను వీక్షిస్తున్న దృశ్యం 

>
మరిన్ని వార్తలు