బెంగాల్‌ తీరాన్ని తాకిన ఉంపన్‌

20 May, 2020 18:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉంపన్‌ తుపాను బుధవారం మధ్యాహ్నం భీకర గాలులతో పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకింది. సాగర్ ఐల్యాండ్స్‌కు 35 కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బెంగాల్‌ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. తీరం దాటే సమయంలో తుపాను నాలుగు గంటల పాటు తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపింది. దిఘా ప్రాంతంలో ఈదురు గాలులతో భారీ వర్షాలు పడుతున్నాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా చాందిపూర్‌లో పెనుగాలులతో వర్షాలు బీభత్సతం సృష్టించాయి. కాగా, మధ్యాహ్నం 3:30-5:30 గంటల సమయంలో ఉంపన్‌ తుపాను తీరం దాటిందని ఐఎండీ సాయంత్రం ప్రకటించింది.

ఉంపన్‌ తుపాను నేపథ్యంలో పశ్చిమబెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో హై అలర్ట్‌ కొనసాగుతోంది. తుపాను సహాయక చర్యల కోసం 41 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. పశ్చిమబెంగాల్‌లో 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఎన్‌డీఆర్‌ఎఫ్ చీఫ్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. ఒడిశాలో లక్షన్నర మందిని తరలించినట్టు చెప్పారు. ఉంపన్‌ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై రేపటికి తగ్గిపోతుందని ఐఎండీ డైరెక్టర్‌ స్టెల్లా ‘సాక్షి’ టీవీతో చెప్పారు. ఎల్లుండి నుంచి ఉంపన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. (తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు?)

మరిన్ని వార్తలు