‘అంఫన్‌’ ఎఫెక్ట్‌; ఎగసిపడుతున్న సముద్ర అలలు

19 May, 2020 19:56 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: సూపర్‌ సైక్లోన్‌ తీవ్రత తగ్గి పెనుతుపానుగా ‘అంఫన్’ మారినట్టు వాతావరణ కేంద్రం మంగళవారం సాయంత్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశాను ఆనుకుని.. పశ్చిమ బెంగాల్‌వైపు పెనుతుపాను పయనిస్తున్నట్టు వెల్లడించింది. పారాదీప్‌కు దక్షిణంగా 360 కిలోమీటర్ల దూరంలో, దిఘాకు దక్షిణ నైరుతి దిశగా 510 కిలోమీటర్ల దూరంలో పెనుతుపాను కేంద్రీకృతం అయినట్టు పేర్కొంది. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం దిఘా(పశ్చిమ బెంగాల్‌)-హతియా దీవుల(బంగ్లాదేశ్‌) మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో పెనుతుపాను తీరం దాటనుంది. తీరందాటే సమయంలో గంటకు 155-185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. దీంతో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముంది. తీరంవెంబడి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అన్ని ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. (భయంకరమైన తుపాను దూసుకొస్తోంది!)

అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అవంతి
అంఫన్‌ పెనుతుపాను ప్రభావంతో విశాఖ జిల్లా మంగమారిపేటలో తీరం వెంబడి సముద్రపు అలలు ముందుకు వచ్చాయి. మంత్రి అవంతి శ్రీనివాస్‌ మంగళవారం మంగమారిపేట గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. తీరం దాటే సమయంలో తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వలలు, బోట్లను తీరానికి దూరంగా ఉంచాలని మత్స్యకారులకు సలహాయిచ్చారు. అంఫన్‌ తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది తీర ప్రాంతంలో సముద్రం సుమారు 50 మీటర్లు ముందుకొచ్చింది. రాజోలు నియోజకవర్గం అంతటా ఈదురుగాలులు వీస్తున్నాయి.

మంత్రి ధర్మాన సమీక్ష
అంఫన్‌ తుపాను హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ధర్మాన‌ కృష్ణదాస్ మంగళవారం శ్రీకాకుళంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున విపత్తుల నిర్వహణ శాఖ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. చెట్లు కూలితే వెంటనే తొలగించడానికి రంపాలు సిద్దం చేయాలని సూచించారు. నదుల్లోకి వచ్చే వరద ప్రవాహంపై పొరుగునున్న ఒడిశా అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ లైన్లలకు తీవ్ర నష్టం‌ వాటిల్లే సూచనలు ఉన్నందున అవసరమైన సామాగ్రి అందుబాటులో సిద్దం‌ చేయాలన్నారు.

భారీ వర్షాలు, ఈదురు గాలులు
అంఫన్‌ తుపాను ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈదురుగాలులుతో కూడిన వర్షం పడింది. ఒడిస్సా పూరీ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల ఉధృతికి జగన్నాథస్వామి దేవాలయ శిఖరంపై ఉన్న భారీ పతాకం ధ్వంసమయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్‌కతా నగరాల్లో వర్షాలు పడుతున్నాయి. అంఫన్‌ పెనుతుపాను ప్రభావం ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. (అంఫన్‌ బీభత్సం మామూలుగా ఉండదు!)

మరిన్ని వార్తలు