అతి తీవ్ర తుపానుగా అంఫన్‌

19 May, 2020 04:04 IST|Sakshi

20న బెంగాల్‌ తీరాన్ని దాటే అవకాశం

అప్రమత్తమైన ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాలు

మహారాణి పేట (విశాఖదక్షిణ)/ భువనేశ్వర్‌: అంఫన్‌ తుపాను సోమవా రం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇది బంగాళాఖాతంలో ఈశాన్యం వైపు పయనించి ఈ నెల 20న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య తీరాన్ని తా కనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అంఫన్‌ ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 780 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇది ఉత్తర–ఈశాన్యం వైపు పయనించి మరింత తీవ్రంగా దిఘా(ప.బెంగాల్‌), హటియా దీవి(బంగ్లాదేశ్‌)ల మధ్య పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ సమయంలో గంటకు 265 కిలోమీటర్ల వేగంగా గాలులు వీయొచ్చు. సోమవారం సాయంత్రం నుంచి ఒడిశా తీరం వెంబడి ఉన్న గజపతి, గంజాం, పూరి, జగత్‌సింగ్‌ పూర్, కేంద్రపార జిల్లాల్లో తీవ్రమైన గాలులు వీయడంతోపాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఒడిశా తీరప్రాంత 12 జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.వాతావరణ శాఖ పశ్చిమ బెంగాల్‌కు ‘ఆరెంజ్‌’హెచ్చరికలను జారీ చేసింది. ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం లేదా సాయంత్రం అంఫన్‌ తీరాన్ని దాటే సమయంలో గాలి తీవ్రత 165 కి.మీ.లు ఉండొచ్చు.

ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష
‘అంఫన్‌’తో ఉత్పన్నమైన పరిస్థితులపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరి రక్షణకూ చర్యలు తీసుకుంటామనీ, ప్రభావిత రాష్ట్రాలకు సాధ్యమైనంత మేర కేంద్రం సాయం అందజేస్తుందని తెలిపారు.

>
మరిన్ని వార్తలు