పింక్‌ సూపర్‌ మూన్‌

6 Apr, 2020 05:11 IST|Sakshi

8వ తేదీ ఉదయం 8 గంటలకు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలోనే ఆకాశవీధిలో ఓ అందాల దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ నెల 7న చంద్రుడిలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్‌ 7 రాత్రి 8.30 గంటలకు చంద్రుడు భూమి కక్ష్యలోకి మరింత దగ్గరగా వచ్చి, భారీ సైజులో కాంతులీనుతూ కనువిందు చేయనున్నాడు. దీనినే పింక్‌ సూపర్‌ మూన్‌ అని పిలుస్తారు. 2020 సంవత్సరంలో చంద్రుడు అత్యంత పెద్దగా కనిపించే రోజు ఇదే. భారత్‌లో 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఈ దృశ్యాన్ని చూడవచ్చునని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో ఇంటిపట్టునే ఉన్న ప్రజలు ఈ సూపర్‌ మూన్‌ అందాలను పూర్తిగా ఆస్వాదించే పరిస్థితి లేదు. ఎందుకంటే భారత్‌లో ఉదయం సమయం కాబట్టి సూపర్‌ మూన్‌ పూర్తి స్థాయిలో కనిపించే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.  

ఏమిటీ పింక్‌ సూపర్‌ మూన్‌
పున్నమి రోజుల్లో కనిపించే చంద్రుడు కంటే అత్యంత ప్రకాశవంతంగా, ఇంకా పెద్దగా ఆకాశ వీధిలో అందాల జాబిలి కనువిందు చేయడాన్నే సూపర్‌ మూన్‌ అంటారు. భూ కక్ష్యలో చంద్రుడు దగ్గరగా ఉండే స్థానాన్ని పెరోజి అంటారు. ఈ పెరోజీలోకి వచ్చినప్పడు చంద్రుడు మరింత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించి అందరినీ అలరిస్తాడు. సాధారణంగా భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కి.మీ. ఉంటుంది. కానీ ఏప్రిల్‌ 7, 8వ తేదీల్లో ఆ దూరం 3,56,000 కి.మీ. తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడి కంటే 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా సూపర్‌ పింక్‌ మూన్‌ దర్శనమిస్తాడు. 20 ఏళ్లలో ఇప్పటివరకు 79 సూపర్‌ మూన్‌లు వచ్చాయి. సగటున మూడు నెలలకో సూపర్‌ మూన్‌ కనిపిస్తుంది. ఈ ఏడాది నెలకో సూపర్‌ మూన్‌ వస్తూనే ఉంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా