జూలై 27 నాటికి ‘రఫేల్‌’ రాక!

30 Jun, 2020 04:20 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రఫేల్‌ యుద్ధ విమానాల సరఫరా త్వరలో మొదలు కానుంది. తొలి దశలో భాగంగా జూలై 27 నాటికి ఆరు రఫేల్‌ యుద్ధవిమానాలు అందనున్నాయని భారత వాయుసేన వర్గాల ద్వారా తెలిసింది. సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో రఫేల్‌ యుద్ధ విమానాల రాక వాయుసేన నైతిక స్థైర్యాన్ని పెంచేదేనని ఆ వర్గాలు తెలిపాయి. దేశంలోనే అత్యంత వ్యూహాత్మక వాయుసేన స్థావరంగా భావించే అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో రఫేల్‌ యుద్ధవిమానాలు ఉంటాయని సమాచారం. భారత్‌ 36 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016 సెప్టెంబరులో రూ.58,000 కోట్లతో ఒక ఒప్పందం చేసుకోవడం తెల్సిందే. కోవిడ్‌ నేపథ్యంలో వీటి సరఫరా ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ఈ నెల రెండవ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లేతో ఫోన్‌లో మాట్లాడారు. సకాలంలో యుద్ధ విమానాలను సరఫరా చేస్తామని రాజ్‌నాథ్‌కు పార్లే హామీ ఇచ్చినట్లు సమాచారం.

రఫేల్‌ యుద్ధ విమానాలు అత్యాధునిక ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. యూరోపియన్‌ క్షిపణి తయారీ సంస్థ ఎంబీడీఏ తయారు చేసే మిటియోర్‌ బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ క్షిపణితోపాటు, స్కాల్ప్‌ క్రూయిజ్‌ క్షిపణులు రఫేల్‌లోని ముఖ్యమైన ఆయుధాలు. దీంతోపాటు ఇజ్రాయెల్‌ తయారీ హెల్మెట్లు, రాడార్‌ వార్నింగ్‌ రిసీవర్లు, లోబ్యాండ్‌ జామర్లు, పది గంటల ఫ్లయిట్‌ డేటా రికార్డింగ్, ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌ అండ్‌ ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ వంటివి భారత్‌ కోసం ప్రత్యేకంగా చేర్చారు. రఫేల్‌ యుద్ధ విమానాలకు సంబంధించి భారత్‌ ఇప్పటికే పైలెట్ల శిక్షణ మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులను పూర్తి చేసింది. తొలి దఫా సరఫరా కానున్న యుద్ధ విమానాలు అంబాలా కేంద్రంగా పనిచేయనుండగా రెండో దఫా సరఫరా అయ్యేవాటిని పశ్చిమ బెంగాల్‌లోని హసిమార వైమానిక కేంద్రంలో ఉంచేందుకు రూ.400 కోట్లతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన విమానాల్లో 30 యుద్ధ విమానాలు కాగా ఆరు శిక్షణ విమానాలు. 

మరిన్ని వార్తలు