న్యాయప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడితే ధిక్కార చర్యలే

23 Oct, 2016 02:02 IST|Sakshi
న్యాయప్రతిష్ట దిగజార్చేలా మాట్లాడితే ధిక్కార చర్యలే

సాక్షి, హైదరాబాద్: నోటికొచ్చినట్లు మాట్లాడి న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే వారిపై కోర్టు ధిక్కార చర్యలు తప్పవని   సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మీడియా సమావేశంలో కోర్టుపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన రాజస్తాన్ మాజీ ఎమ్మెల్యే, కమ్యూనిస్టు నేతలపై ఆ రాష్ట్ర హైకోర్టు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవడాన్ని సుప్రీంసమర్థించింది. అయితే, హైకోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేసి, జరిమానాను మాత్రం విధిస్తూ జస్టిస్ అనిల్ రమేశ్ దవే, జస్టిస్ లావు నాగేశ్వరరావుల బెంచ్ తీర్పు చెప్పింది.

2000సంవత్సరంలో  కమ్యూనిస్టు నేత దర్శన్ కోడా  హత్య కేసులో కొందరు నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిలిచ్చింది. దీంతో, మాజీ ఎమ్మెల్యే, కమ్యూనిస్టు నేత హెట్‌రామ్ బేణీవాల్, నవరంగ్ చౌదరి, భూరామల్‌స్వామి, హర్దీప్‌సింగ్‌లు పత్రికాసమావేశం ఏర్పాటుచేసి తీర్పును తీవ్రంగా విమర్శించారు. బెయిలు వెనుక నగదు చేతులు మారిందన్నారు. దీంతో వీరిపై రఘువీర్‌సింగ్ అనే వ్యక్తి కోర్టుధిక్కార పిటిషన్ వేశారు. పత్రికా సమావేశంలో వీరి వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని, ఇవి కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని హైకోర్టు తేల్చింది. వారికి 2 నెలల జైలుశిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ బేణీవాల్ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లను సుప్రీంవిచారించింది. అవినీతిపరులంటూ జడ్జీలపై నిరాధార ఆరోపణలు చేయడం కచ్చితంగా న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడమే అవుతుందని కోర్టు పేర్కొంది. కేసులో ఉన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ జైలుశిక్షను రద్దు చేసి జరిమానాను కొనసాగిస్తున్నట్లు తీర్పులో పేర్కొంది.

మరిన్ని వార్తలు