జీఎస్టీ ఎగవేతదారులపై సుప్రీంకోర్టు కొరడా

29 May, 2019 12:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతదారులపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. ఎగవేతదారుల అరెస్టు విషయమై జీఎస్టీ అథారిటీలకు ఉన్న అధికారాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు తాజాగా అంగీకారం తెలిపింది. నాలుగు వారాల తర్వాత ఈ పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఎగవేతదారుల అరెస్టులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ నేతృత్వంలోని వెకేషన్‌ ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది.

పన్ను ఎగవేతదారులను జీఎస్టీ అథారిటీ అరెస్టు చేయవచ్చునని  ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో వివిధ రాష్ట్రాల హైకోర్టులు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం, ఎగవేతదారులకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తున్న నేపథ్యంలో త్రిసభ్య ధర్మాసనం ఈ అంశాన్ని విచారించనుంది. త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు వెలువడేవరకు ఎగవేతదారుల పిటిషన్లపై విచారణ సమయంలో తమ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఎగవేతదారుల అరెస్టును సమర్థించిన విషయాన్ని గుర్తించాలని వివిధ రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది.

మరిన్ని వార్తలు