‘ఆధార్‌’ చట్ట బద్ధతపై సుప్రీం విచారణ

23 Nov, 2019 02:09 IST|Sakshi

ప్రైవేటు సంస్థలకు ఆధార్‌ డేటా ఇవ్వడం ఎంతవరకు సబబంటూ దాఖలైన పిల్‌    

న్యూఢిల్లీ: ఆధార్‌ సవరణ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, మొబైల్‌ కనెక్షన్లు పొందడానికి వినియోగదారులు స్వచ్ఛందంగా తమ గుర్తింపు పత్రం కింద ఆధార్‌ నంబర్‌ను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం ఎంతవరకు సరైందన్న అంశాలనూ సుప్రీం విచారించనుంది. ఆధార్‌ సవరణ చట్టం పౌరుల వ్యక్తిగత భద్రత, గోప్యతకు భంగం వాటిల్లేలా ఉందని, ఇది ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమేనని దాఖలైన ప్రజా ప్రయోజనా వ్యాజ్యాన్ని సుప్రీం శుక్రవారం విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన సుప్రీం బెంచ్‌ కేంద్రానికి, యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ)లకు నోటీసులు జారీ చేసింది. కొన్ని మినహాయింపులతో ఆధార్‌ చట్టం రాజ్యాంగబద్ధమేనని గత ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.   

జూలైలో ఆధార్‌ సవరణ చట్టం  
సుప్రీం తీర్పుతో కేంద్రం ఆధార్, ఇతర చట్టాలకు సవరణలు తీసుకువచ్చింది. వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాలను అందించడంలో స్వచ్ఛందంగా 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను ఉపయోగించడానికి వీలు కల్పిస్తూ ఆధార్, ఇతర చట్టాలకు సవరణలు చేసింది.  ఈ బిల్లును జూలై 8న పార్లమెంటు ఆమోదించింది. తాజాగా ఆర్మీ మాజీ అధికారి ఎస్‌జీ వోంబట్కెరె, సామాజిక కార్యకర్త విల్సన్‌ ఆధార్‌ (సవరణ) చట్టం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ పిల్‌ దాఖలు వేశారు.  దీనిపై కేంద్రానికి, యూఐడీఐఏకు సుప్రీం నోటీసులు పంపింది.

మరిన్ని వార్తలు