‘ట్రిపుల్‌ తలాక్‌’ చట్టాన్ని పరిశీలిస్తాం!

24 Aug, 2019 03:51 IST|Sakshi

చట్టం చెల్లుబాటుపై విచారణకు సుప్రీం ఓకే

న్యూఢిల్లీ: ముస్లింలలో తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణించి, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కేంద్రం తెచ్చిన చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్ల మేరకు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. ట్రిపుల్‌ తలాక్‌కు సంబంధించి ‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం–2019’ని ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించటం తెలిసిందే. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను పరిశీలించాలంటూ వచ్చిన నాలుగు పిటిషన్లపై జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీల ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ వాదిస్తూ, ట్రిపుల్‌ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా మార్చడం, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించడం పట్ల తాము ఆందోళనతో ఉన్నామన్నారు.

ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు చెప్పినందున ఇప్పుడు శిక్షార్హమైన నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని ఆయన వాదించారు. బాధిత మహిళ వాదన విన్నాకనే బెయిలు మంజూరు చేయాలన్న షరతు కూడా సరికాదని ఖుర్షీద్‌ తెలిపారు. ‘ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదని కోర్టు గతంలోనే చెప్పినందున ఇప్పుడు ఆ పద్ధతే లేదు. మరి వారు దేనిని నేరంగా పరిగణిస్తారు’ అని ఆయన ప్రశ్నించారు. దీనికి కోర్టు స్పందిస్తూ మరి ఎవరైనా ఇప్పటికీ ట్రిపుల్‌ తలాక్‌ పద్ధతిలో విడాకులిస్తే ఏం చేయాలనీ, దీనికి పరిష్కారం ఏంటని ప్రశ్నించింది. ఖుర్షీద్‌ సమాధానమిస్తూ ట్రిపుల్‌ తలాక్‌ను కోర్టు ఎప్పుడో రద్దు చేసిందని మళ్లీ చెబుతూ, చట్టంలోని వివిధ ఇతర అంశాలను పరిశీలించాలని కోరారు.

మరిన్ని వార్తలు