మత ప్రచారకులపై సుప్రీం ఆగ్రహం

26 Jul, 2018 20:25 IST|Sakshi

తిరువనంతపురం : కేరళలో ఇటీవల తరుచుగా నమోదవుతున్న మత ప్రచారకుల అత్యాచార కేసులపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొంత కాలంగా కేరళలో క్రైస్తవ మత బోదకులపై లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. జస్టిస్‌ ఏకే సిక్రీ, ఆశోక్‌ బూషన్‌తో కూడిన ధర్మాసనం కేరళకు చెందిన రెండు వేర్వేరు పిటిషన్‌లను విచారిస్తూ.. ఈ ఘటనలపై పూర్తి వివరాలను ఆగస్ట్‌ 26లోపు తన ముందుంచాలని గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కేవలం క్రైస్తవ మత ప్రచారకులపైనే ఐపీసీ 376 ప్రకారం ఎందుకు రేప్‌ కేసులు నమోదవుతున్నాయని, ఒకదాని తరువాత ఒకటి ఎందుకు పునరావృత్తం అవుతున్నాయని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాజాగా లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాదర్‌ జైసీ కే జార్జ్‌, ఫాదర్‌ సోనీ అరెస్ట్‌లపై ఆగస్ట్‌ ఆరు వరకు సుప్రీం స్టే విధించింది. పలువురిపై అత్యాచారం జరిపారన్న ఆరోపణలతో జూన్‌ 12న అరెస్టయిన జాబ్‌ మాథ్యూకు బుధవారం కేరళ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

 2009 నుంచి మాథ్యూ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పలు ఆరోపణలు చేశారు. చర్చలో మరో ఫాదర్‌ తన భార్యను బ్లాక్‌ మెయిల్‌ చేసి లైంగికంగా వేధిస్తున్నారంటూ ఇటీవల ఓ మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటిపై తనకు పూర్తి నివేదికను అందించాలని న్యాయస్థానం కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరిన్ని వార్తలు