కళంకిత ప్రజా ప్రతినిధుల జాబితాపై సుప్రీం ఆదేశాలు..

12 Sep, 2018 13:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎంపీలు, ఎమ్మెల్యేలపై  పెండింగ్‌లో ఉన్న  క్రిమినల్‌ కేసుల జాబితాను సమర్పించాలని సర్వోన్నత న్యాయస్ధానం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, హైకోర్టు రిజిస్ర్టార్‌ జనరల్స్‌ను కోరింది. తాను జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేసులను ప్రత్యేక కోర్టుకు బదలాయించారా లేదా అనే వివరాలను తెలిపాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై అక్టోబర్‌ 12న తదుపరి విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది.

కళంకిత ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అంశంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో అఫిడవిట్‌ దాఖలు చేసింది. కళంకిత చట్టసభ సభ్యులపై క్రిమినల్‌ కేసుల పురోగతికి సంబంధించి ఇప్పటివరకూ 11 రాష్ట్రాల నుంచి సమాచారం లభ్యమైందని కేంద్రం తెలిపింది. ఇక కళంకిత చట్టసభ సభ్యులపై నమోదైన 1233 కేసులను 12 స్పెషల్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులకు మళ్లించగా 136 కేసులు క్లియర్‌ అయ్యాయని పేర్కొంది. ఈ 11 రాష్ట్రాల్లో 1097 కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.

బిహార్‌లో అత్యధికంగా 249 కేసులు ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. ఇక కేరళలో 233 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 226 కేసులు చట్టసభ సభ్యులపై విచారణ దశలో ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు