చిదంబరానికి బెయిల్‌

5 Dec, 2019 01:26 IST|Sakshi
తీహార్‌ జైలు బయట చిదంబరం అభివాదం

సాక్ష్యాలు తారుమారు చేస్తారనడానికి ఆధారాల్లేవన్న సుప్రీం

106 రోజుల జైలు జీవితం నుంచి విముక్తి

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కుంభకోణం, మనీ ల్యాండరింగ్‌ కేసుల్లో కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి ఎట్టకేలకు ఊరట లభించింది. 106 రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు బుధవారం సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సుప్రీం ఉత్తర్వులు అందిన తర్వాత తీహార్‌ జైలు గేట్‌ నంబర్‌ 3 నుంచి రాత్రి 8.10 గంటలకు చిదంబరం బయటకి వచ్చారు. కుమారుడు కార్తితో పాటుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు జైలు వెలుపల చిదంబరానికి ఘనంగా స్వాగతం పలికారు. జైలు బయట చిదంబరం స్పందన కోసం వేచి చూస్తున్న మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు.

‘‘106 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది‘ అని అన్నారు. ఇన్ని రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించినా తనపై ఒక్క అభియోగం కూడా నమోదు కాలేదని చెప్పారు. అంతకుముందు సుప్రీంకోర్టు చిదంబరానికి బెయిల్‌ ఇస్తే ఆయన సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న ఈడీ వాదనల్ని తోసిపుచ్చింది. ‘చిదంబరం ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధి కాదు, ఆయనకు రాజకీయ అధికారాలు లేవు. సాక్ష్యాధారాలను నాశనం చేసే అవకాశమే లేదు’ అని జస్టిస్‌ ఆర్‌.భానుమతి ధర్మాసనం పేర్కొంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ ఆగస్టు 21న చిదంబరాన్నికస్టడీలోకి తీసుకుంది. ఆ తర్వాత తీహార్‌జైల్లోనే ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టింది.

ఇంటర్వ్యూలు వద్దు: బెయిల్‌పై విడుదలయ్యాక ఈ కేసుకు సంబంధించి చిదంబరం మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆంక్షలు విధించింది. ఈడీ ఎప్పుడు అడిగినా చిదంబరం అందుబాటులో ఉండి విచారణకు సహకరించాలని, ట్రయల్‌ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని ఆదేశాలిచ్చింది.

ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది: కాంగ్రెస్‌
చిదంబరానికి బెయిల్‌ మంజూరు చేయడంపై కాంగ్రెస్‌ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించింది. పగ, ప్రతీకారాల కారణంగా చిదంబరం వంద రోజులకుపైగా జైలులో మగ్గిపోయారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. నిష్పాక్షికంగా జరిగే విచారణలో చిదంబరం నిర్దోషిత్వం రుజువు అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, చిదంబరం ‘బెయిల్‌ క్లబ్‌’లో చేరారంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. ఎందరో కాంగ్రెస్‌ నేతలు బెయిల్‌పై బయట తిరుగుతున్నారని ఆ క్లబ్‌లో ఇప్పుడు చిదంబరం చేరారంటూ హేళన చేసింది.
 

మరిన్ని వార్తలు