విదేశాల్లో మహిళా సేనాని

21 Feb, 2020 04:01 IST|Sakshi

 చైనా ఆర్మీలో 5%లోపే మహిళా సైన్యాధికారులు

2016 తరువాతే అమెరికా పోరాట దళాల్లోకి..

శాశ్వత కమిషన్‌తో పాటు కమాండ్‌ పోస్ట్‌ల్లో మహిళా అధికారులను నియమించాలని ఆర్మీని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లోని ఆర్మీల్లో మహిళా అధికారుల పరిస్థితిపై చిన్న కథనం.

న్యూఢిల్లీ: యుద్ధ విధుల్లో కీలక పాత్ర పోషించే అవకాశం మహిళలకు లభించడం అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇటీవల కాలంలోనే ప్రారంభమైంది. ముఖ్యంగా ప్రత్యక్ష యుద్ధ విధుల్లో, ప్రత్యేక ఆపరేషన్ల కోసం ఏర్పాటైన సుశిక్షిత దళాల్లో మహిళకు అవకాశం కల్పించడం బ్రిటన్‌లో 2018లో ప్రారంభించారు. అంతకుముందు, ఆయా దళాల్లో మహిళా సైనికాధికారులను చేర్చుకునే విషయంలో నిషేధం ఉండేది. అమెరికా సైన్యంలో కూడా 2016 వరకు సాధారణ సైనిక విధులకు మాత్రమే మహిళలు పరిమితమయ్యారు. 2016లో పోరాట దళాల్లోనూ వారికి అవకాశం కల్పించడం ప్రారంభించారు. 2019 సంవత్సరంనాటికి క్షేత్ర స్థాయి పోరాట దళాల్లో కీలక విధుల్లో ఉన్న మహిళా అధికారుల సంఖ్య 2906కి చేరుకుంది. అమెరికా వైమానిక, నౌకా దళాల్లోని పోరాట బృందాల్లో మహిళల భాగస్వామ్యం మాత్రం 1990వ దశకం మొదట్లోనే ప్రారంభమైంది.

చైనాలో.. ప్రపంచంలోనే సంఖ్యాపరంగా అత్యంత పెద్ద సైన్యం.. చైనాకు చెందిన ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)’ అన్న విషయం తెలిసిందే. దాదాపు 14 లక్షల చైనా ఆర్మీ గ్రౌండ్‌ ఫోర్స్‌లో ఉన్న మహిళా అధికారుల సంఖ్య సుమారు 53 వేలు మాత్రమే. అంటే 5శాతం కూడా లేరు. అలాగే, మన మరో పొరుగుదేశం పాకిస్తాన్‌ సాయుధ దళాల్లోని మహిళల సంఖ్య 3400 మాత్రమే. కెనడా దేశం 1989 సంవత్సరంలో, డెన్మార్క్‌ 1988 సంవత్సరంలో, ఇజ్రాయెల్‌ 1985లో సైనిక పోరాట విధుల్లో మహిళా సైనికులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. సైన్యంలోకి మహిళలను తీసుకోవడం మాత్రం ఇజ్రాయెల్‌ 1948లోనే ప్రారంభించింది.   యుద్ధ విధుల్లోని అన్ని స్థాయిల్లో మహిళలకు అవకాశం కల్పించిన తొలి నాటో దేశంగా నార్వే నిలిచింది. ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్ట్రాటెజిక్‌ స్టడీస్‌ గణాంకాల ప్రకారం రష్యా సాయుధ దళాల్లో మహిళలు దాదాపు 10శాతం ఉన్నారు.   

ఆర్మీలో లింగ వివక్ష లేదు: మహిళా సైనికాధికారులకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, కమాండ్‌ పోస్ట్‌ల్లో వారికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆర్మీ చీఫ్‌ నరవణె పేర్కొన్నారు. మహిళలకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటుతో లింగ సమానత్వ దిశగా ముందడుగు వేసినట్లు అవుతుందన్నారు. ఆర్మీలోని వివిధ స్థాయిల్లో విధులు అప్పగించేందుకు వీలుగా 100 మహిళా సైనికులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. శాశ్వత కమిషన్‌లో చేరేందుకు సిద్ధమా? అని మహిళాఅధికారులకు లేఖలను పంపిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు