-

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం

4 Nov, 2019 17:48 IST|Sakshi

న్యూఢిల్లీ :  దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్య బాధ్యత రాజధాని ప్రాంత పరిధిలోని రాష్ట్రాలదే అని తేల్చి చెప్పింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయడంపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీస్ కమిషనర్లు బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు సప్ష్టం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ఫై జస్టిస్‌ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అరగంటలో పర్యావరణ నిపుణులను కోర్టుకు తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించింది. నిపుణుల సలహాలు, సూచనలతో వాయు కాలుష్యంపై ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.

రైతులకు పంట వ్యర్థాలను కాల్చే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘జీవించే హక్కు చాలా ముఖ్యమైనదని, సాధారణంగా ఏక్యూఐ 401 దాటితేనే అక్కడ గాలి కాలుష్యం దారుణంగా ఉన్నట్లు పరిగణిస్తారు.. ఢిల్లీలో అయితే ఇది 500 పాయింట్లు దాటింది. అంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. వాయు కాలుష్యం తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో పని ఉంటే తప్ప ప్రజలను బయటికి రావొద్దని ప్రభుత్వం సూచిస్తోందంటే కాలుష్య స్థాయి ఎంత ఎక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఆదివారం రోజున ఢిల్లీలోని రోహిణి, జహంగీర్‌పుర, సోనియా విహార్ తదితర ప్రాంతాల్లో ఈ సూచీ 999ని తాకిందంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఇలాంటి వాతావరణంతో మనం బతకగలమా? ఇంట్లో కూర్చున్నా సురక్షితంగా  ఉండలేరు. ఇది చాలా భయానకం. ప్రతి ఏడాది కాలుష్యం పెరుగుతున్నా మనం ఏమీ చేయలేకపోతున్నాం. కాలుష్యంతో ప్రజలు చనిపోతున్నారు. నాగరిక దేశంలో ఇలాంటి మరణాలు ఉండకూడద’ని ధర్మాసనం పేర్కొంది.

మరిన్ని వార్తలు