న్యాయవ్యవస్థ నవ్వులపాలైంది

6 Jul, 2017 02:22 IST|Sakshi
న్యాయవ్యవస్థ నవ్వులపాలైంది
జస్టిస్‌ కర్ణన్‌ కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య
 
న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీఎస్‌ కర్ణన్‌ వల్ల న్యాయవ్యవస్థ నవ్వులపాలైందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయన మొరటుగా, పొగరుగా, కోర్టును ధిక్కరిస్తూ చేసిన పనులు శిక్షార్హమైనవని కోర్టు వ్యాఖ్యానించింది. కర్ణన్‌కు విధించిన ఆరు నెలల జైలు శిక్షకు సంబంధించిన పూర్తి తీర్పును సుప్రీంకోర్టు బుధవారం వెబ్‌సైట్‌లో పెట్టింది. సిట్టింగ్‌ జడ్జికి శిక్ష వేస్తూ తీర్పునివ్వాల్సిరావడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది. కర్ణన్‌ కేసు విషయంలో తాము జోక్యం చేసుకుని ఆదేశాలిస్తున్న సమయంలో ఆయన మరింత దురుసుగా ప్రవర్తించారంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం మే 9న ఈ తీర్పును క్లుప్తంగా ఇవ్వడం తెలిసిందే.
 
జడ్జీల నియామక ప్రక్రియను సమీక్షించాలి
ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తులను నియమించే విధానాన్ని సమీక్షించాల్సిన అవసరాన్ని కర్ణన్‌ కేసు ఎత్తిచూపుతోందని జస్టిస్‌ చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌గొగోయ్‌లు తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే న్యాయమూర్తుల ప్రవర్తన సరిగా లేనప్పుడు వారిని అభిశంసించకుండానే దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి ఓ న్యాయ యంత్రాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని వారు సూచించారు. 
మరిన్ని వార్తలు