పెద్దల పోరులో పిల్లలే బాధితులు

19 Feb, 2020 02:59 IST|Sakshi

సుప్రీంకోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ:  తల్లిదండ్రులు విడిపోయే కేసుల్లో అంతిమంగా బాధితులయ్యేది వారి పిల్లలేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమ తప్పేమీ లేకుండానే వారు శిక్షను అనుభవిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. తల్లిదండ్రుల్లో ఎవరి దగ్గర ఉండాలన్న న్యాయ పోరాటంలో చివరకు నష్టపోతోంది.. తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలను కోల్పోయి అందరికన్నా ఎక్కువ మూల్యం చెల్లిస్తోంది చిన్నారులేనని పేర్కొంది. కన్నవారి ప్రేమను పొందే హక్కు పిల్లలకు ఉంటుందని, ఆ హక్కును అంతా గౌరవించాలని, వివాహ బంధం విచ్ఛిన్నమైనంత మాత్రాన.. తల్లిదండ్రులుగా వారి బాధ్యత ముగిసిపోదని స్పష్టం చేసింది. పిల్లల భవిష్యత్తును, వారి ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని వారిని తల్లిదండ్రుల్లో ఎవరి వద్ద ఉంచాలో నిర్ణయించాలని కోర్టులకు సూచించింది. దంపతులిద్దరూ కలిసి ఉండటం సాధ్యం కాదని తేలిన పక్షంలో.. చిన్నారుల కస్టడీ(తల్లిదండ్రుల్లో ఎవరి దగ్గర ఉండాలనే) విషయాన్ని అతి త్వరగా తేల్చాలని జస్టిస్‌ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిల ధర్మాసనం  పేర్కొంది.

‘కస్టడీ పోరులో తల్లిదండ్రుల్లో ఎవరు గెలిచినా.. చివరకు ఓడేది చిన్నారులే. ఈ పోరాటంలో అత్యధిక మూల్యం చెల్లిస్తోంది వారే’ అని ధర్మాసనం ఆవేదన చెందింది. తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకున్న తరువాత వారిద్దరి పిల్లలు ఎవరి దగ్గర పెరగాలనే విషయంపై దాఖలైన ఒక వ్యాజ్యం విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. పిల్లలే కాదు.. వారి తాత, నానమ్మ/అమ్మమ్మలు కూడా మనవలు, మనవరాళ్ల ముద్దు ముచ్చట్లను కోల్పోతున్నారని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కేసులో దసరా, దీపావళి, వేసవి సెలవులను ఆ ఇద్దరు పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరి దగ్గర గడపాలో సూచిస్తూ 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొనసాగించాలని, వారి విడాకుల కేసును సంబంధిత కోర్టు ఈ సంవత్సరం డిసెంబర్‌ 31లోగా తేల్చాలని ఆదేశించింది. ఆ పిల్లలను బోర్డింగ్‌ స్కూళ్లో చేర్చాలని సుప్రీంకోర్టు 2017 నాటి ఆదేశాల్లో పేర్కొంది.

మరిన్ని వార్తలు