జడ్జీల వివాదం పరిష్కారమయ్యేనా?

16 Jan, 2018 14:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు పరిపాలనా వ్యవస్థ సక్రమంగా లేదని, కీలకమైన కేసుల విచారణకు బెంచీలను ఏర్పాటు చేయడంలో సీనియర్‌ జడ్జీలను కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సీనియర్‌ జడ్జీలు పత్రికాముఖంగా దేశ ప్రజలకు స్పష్టం చేసి అప్పుడే నాలుగు రోజులు గడిచిపోయాయి. వారి ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. పైగా బుధవారం ఎనిమిది కీలక కేసులను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా ఆధ్వర్యాన ఐదుగురు సభ్యుల బెంచీని ఇవాళ (మంగళవారం) సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది.

ఈ ఎనిమిది కీలక కేసుల్లో ఆధార్‌ ఒకటికాగా,  స్వలింగ సంపర్కలకు శిక్ష విధించే భారతీయ శిక్షాస్మతిలోని 377వ సెక్షన్‌ చెల్లుతుందా ? అన్నది రెండవ కేసు. ఐపీసీలోని అక్రమ సంబంధం సెక్షన్‌ ఇప్పటికీ చెల్లుతుందా? అన్నది మూడో కేసుకాగా, శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలా, వద్దా ? అన్నది నాలుగో కేసు. ఇవి కాకుండా మరో నాలుగు కేసులు ముఖ్యమైనవి ఉన్నాయి. వీటి విచారణకు దీపక్‌ మిశ్రా నాయకత్వాన ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బెంచీలో సీనియర్‌ న్యామూర్తులైన జస్టిస్‌ చలమేశ్వర్‌, రంజన్‌ గొగోయ్, కురియన్‌ జోసఫ్, మదన్‌ లోకుర్‌లో ఒక్కరు కూడా లేరు. ఈ నలుగురు న్యాయమూర్తులే చరిత్రలో మొట్టమొదటి సారిగా శుక్రవారం పత్రికా విలేకరుల ముందుకు వచ్చి సీజేఐ దీపక్‌ మిశ్రా తీరును ఆక్షేపించిన విషయం తెల్సిందే.

కీలకమైన కేసులను సీనియర్‌ జడ్జీలకు ఇవ్వకుండా తన ఇష్టానుసారం ఇస్తున్నారని, ఇతర బెంచీల ముందున్న కేసులను అనుచితంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రధాన నిందితుడుగా ఉన్న సొహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసును విచారించిన మహారాష్ట్ర సీబీఐ జడ్జీ బ్రిజ్‌ మోహన్‌ లోయా అనుమానాస్పద మతిపై తమకు అనుమానాలు ఉన్నాయని కూడా వారు ఆరోపించారు. ఆ మృతి కేసుపై దర్యాప్తు జరపాలంటూ ముంబై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా, ఆదరబాదరగా అదేరోజు సుప్రీం కోర్టులో అదే అంశంపై దాఖలైన రిట్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ కేసు విచారణ అధికారాన్ని సుప్రీం కోర్టు తన పరిధిలోకి లాక్కోవడం కూడా సమంజసంగా లేదని వారు విమర్శించారు. వాళ్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా సుప్రీం కోర్టు లోయా అనుమానాస్పద మృతి కేసు విచారణను చేపట్టింది.

తాము బహిరంగంగా లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, పూర్తి భిన్నంగా వ్యవహరించడం పట్ల నలుగురు సీనియర్‌ జడ్జీలు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసినట్లు వారి సన్నిహితులు తెలియజేశారు. ఈ వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవడం మంచిదని భారత బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ మానన్‌ కుమార్‌ మిశ్రా, అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వ్యాఖ్యానించారు. అయితే ఇది అంత తొందరగా సమసిపోయే సమస్యగా కనిపించడం లేదని నలుగురు జడ్జీల కార్యాలయ వర్గాలు అంటున్నాయి. వీరికి అండగా మరింతమంది సుప్రీంకోర్టు జడ్జీలు ముందుకు వస్తే వివాదం పరిష్కారం కావచ్చని ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

అయితే చాలామంది జడ్జీలు అచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం సుప్రీం కోర్టు కార్యకాలాపాలు ప్రారంభం కాకముందు జడ్జీలందరూ తేనీరు సేవిస్తుండగా వారి మధ్య వాడివేడిగా ఇదే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన న్యాయమూర్తే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని వారంతా అభిప్రాయపడినట్లు తెల్సింది.

మరిన్ని వార్తలు