క‌రోనా: సెల‌వుల ర‌ద్దు దిశ‌గా సుప్రీంకోర్టు

13 May, 2020 15:55 IST|Sakshi

న్యూఢిల్లీ: క‌రోనా నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కేసుల విచార‌ణ‌పై ప్ర‌భావం చూపినందున ఈసారి వేసవి సెల‌వుల‌ను త్యాగం చేసేందుకు సుప్రీంకోర్టు సిద్ధ‌మైంది. మే 17న ప్రారంభం కానున్న సెల‌వులను ర‌ద్దు చేసి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు 50 రోజులుండే వేసవి సెల‌వు దినాల్లో కేవ‌లం అత్య‌వ‌స‌ర కేసులు మాత్ర‌మే విచార‌ణ‌కొస్తాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎస్‌.ఎ. బోబ్డే సెల‌వుల‌ను ర‌ద్దు చేసే దిశ‌గా నిర్ణ‌యం తీసుకోనున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఉన్న‌ న్యాయ‌మూర్తుల్లో స‌గానికి పైగా మంది వేస‌విలోనూ ప‌ని చేయ‌నున్నారు. (లిక్కర్‌పై సుప్రీంకోర్టుకెక్కిన తమిళనాడు)

లాక్‌డౌన్ వ‌ల్ల ఇప్ప‌టికే ప‌ని దినాల‌ను కోల్పోయామని, కాబ‌ట్టి వేస‌వి సెల‌వు‌లను త‌గ్గిస్తూ, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కేసుల‌ను విచారించాల‌ని జ‌స్టిస్ ఎల్ఎన్ రావుతో కూడిన‌ న్యాయ‌మూర్తుల క‌మిటీ సిఫార‌సు చేసింది. దీంతో భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం కేసుల విచార‌ణ కోసం ఏడు వారాల వేసవి సెల‌వుల‌ను తగ్గించుకోనుంది. అలాగే క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో లాయ‌ర్లు, జడ్జులు, ఇతర న్యాయ సిబ్బందికి కూడా కొత్త డ్రెస్ కోడ్ తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా వుండ‌గా ఇప్ప‌టికే ఢిల్లీ హైకోర్టు సెల‌వుల‌ను త‌గ్గించుకున్న విష‌యం తెలిసిందే. (ఆన్‌లైన్‌లో మద్యం విక్రయంపై ఆలోచించండి)

మరిన్ని వార్తలు