సమాజం మనసు మారుతుందా..?

9 Sep, 2018 02:13 IST|Sakshi

స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పునిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. ఇందుకు అనుగుణంగా వివాహం, దత్తత, వారసత్వ హక్కుల వంటి అంశాల్లో మార్పులు జరగాల్సి ఉంది. ఇన్నాళ్లూ వివక్షకు గురవుతున్న ఎల్‌జీబీటీక్యూ (లెస్బియన్లు, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్స్‌..) లకు పౌర హక్కులు దక్కాల్సి ఉంది. ఈ పరిణామాలు సమాజం ఆలోచనల్లో మార్పు తెస్తాయా? స్వలింగ సంపర్కులను సాటి ప్రజలు సరిగా అర్థం చేసుకుంటారా? ఈ విషయంలో ప్రపంచ దేశాల అనుభవాలు వంటి అంశాలపై సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ పరిశోధకులు చార్లెస్‌ కెన్నీ, దేవ్‌ పటేల్‌ అధ్యయనం చేశారు.


వ్యతిరేకిస్తున్న యువత
సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీస్‌ (సీఎస్‌డీఎస్‌) అధ్యయనం ప్రకారం భారతీయ యువత స్వలింగ సంపర్కాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. 61 శాతం మంది ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీల మధ్య ప్రేమ సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రతి నలుగురిలో ఒక్కరేగే/లెస్బియన్‌ సంబంధాలను ఆమోదిస్తున్నారు.
15–17 ఏళ్ల యువతలో 31 శాతం మంది ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ తప్పుకాదంటున్నారు. 30–34 ఏళ్ల యువకుల్లో ఇలా ఆలోచిస్తున్న వారు 21 శాతమే.
ఎలాంటి మత భావనల్లేని వారితో పోల్చుకుంటే మత విశ్వాసం ఉన్న వారిలోనే ఎక్కువ మంది స్వలింగ సంపర్కాన్ని ఆమోదిస్తున్నారు.
పెద్ద నగరాలతో పోల్చుకుంటే.. చిన్న నగరాలు, గ్రామాల్లో స్వలింగ సంపర్కాన్ని ఆమోదించేవారు ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. నగరాల్లోనే ఇలాంటి ‘ప్రేమలు’ ఉంటాయనే అభిప్రాయంలో వాస్తవం లేదని సర్వే తేల్చింది.

తీర్పు అనంతరం పరిస్థితులేంటి..?
సెక్షన్‌ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఉత్సాహం పొందిన ఎల్‌జీబీటీక్యూలు ఇప్పుడు తమ ఇతర హక్కుల సాధనపై దృష్టి సారిస్తున్నారు.తమకూ వివాహం, వారసత్వం, సరోగసీ, దత్తత వంటి అంశాల్లో హక్కులు కల్పించాలని ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. స్వలింగ సంపరాన్ని నేరం కాదన్న అంశం వరకే ధర్మాసనం పరిమితం కావాలని, ఇతర హక్కుల జోలికి వెళ్లొద్దని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సెక్షన్‌ 377 కేసు విచారణలో సుప్రీం కోర్టుకు స్పష్టం చేశారు.

దీన్ని బట్టి వారికి ఇతర హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని స్పష్టం అవుతోందని న్యాయ నిపుణులు అంటున్నారు. స్వలింగ సంపర్కం నేరం కాదన్న సుప్రీం తీర్పుతో వారికి ప్రాథమిక హక్కు లభించింది కాబట్టి వివాహం, వారసత్వం, బీమా హక్కులు కూడా ఇందులో భాగమవుతాయని,ఈ హక్కులను నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని 377 కే సు పిటిషనర్లలో ఒకరైన సునీల్‌ మెహ్రా అన్నారు.

వివాహాన్ని ఆమోదించదు
స్వలింగ సంపర్కం నేరం కాదన్నంత వరకు బాగానే ఉందని, అయితే వారి వివాహాన్ని కూడా చట్టబద్ధం చేయాలన్న డిమాండ్‌ను మాత్రం ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.‘ఇద్దరు మహిళలు లేదా ఇద్దరు పురుషులు పెళ్లిచేసుకోవడం ప్రకృతి విరుద్ధం.దీన్ని సమర్థించబోం.ఇలాంటి సంబంధాలను గుర్తించే సంప్రదాయం భారతీయ సమాజంలో లేదు’అని ఆరెస్సెస్‌ ప్రతినిధి అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. సెక్షన్‌ 377 రద్దును కాంగ్రెస్‌ స్వాగతించినా గేలకు ఇతర హక్కుల విషయంలో తనవైఖరి తెలియజేయలేదు.

ఇతర హక్కుల జోలికెళ్లని ధర్మాసనం
స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు వారి ఇతర హక్కుల జోలికి వెళ్లలేదు. సామాజిక నిబంధనలు గేల రాజ్యాంగ హక్కులను ఎలా నియంత్రించజాలవో తన తీర్పులో వివరించిన ధర్మాసనం వివాహం, వారసత్వం వంటి ఇతర హక్కుల గురించి ఏమీ ప్రస్తావించలేదు.

మరిన్ని వార్తలు