ప్రస్తుతం ఎక్కడివారు అక్కడ ఉంటేనే మేలు: సుప్రీంకోర్టు

13 Apr, 2020 16:02 IST|Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభిస్తున్న తరుణంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకురావాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఇరాన్‌, అమెరికాలో చిక్కుకున్న వారిని రప్పించాలన్న పిటిషన్లపై సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడివారు అక్కడే ఉండటం మేలని అభిప్రాయపడ్డ సర్వోన్నత న్యాయస్థానం.... విదేశాల్లో ఉన్నవారిని ఇప్పటికిప్పుడు తీసుకురమ్మని ఆదేశించలేమని పేర్కొంది. అదే సమయంలో విదేశాల్లోని భారతీయుల రక్షణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.(వెనక్కి తీసుకువెళ్లకపోతే కఠిన చర్యలు: యూఏఈ)

కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకుపోయిన దాదాపు 58 మంది పౌరులను భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి రప్పించిన విషయం తెలిసిందే. అయితే కరోనా విజృంభిస్తున్న కారణంగా పలు దేశాలు లాక్‌డౌన్‌ విధించడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని పలువురు కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తమ దేశంలో చిక్కుకుపోయిన విదేశీ పౌరులకు కరోనా నెగటివ్‌గా తేలితే వారిని స్వదేశానికి పంపిస్తామని యూఏఈ వెల్లడించిన విషయం తెలిసిందే. భారత్‌ సహా పలు దేశాల రాయబార కార్యాలయాలకు ఈ మేరకు సమాచారం అందించినట్లు గల్ఫ్‌ మీడియా పేర్కొంది. మరోవైపు భారత్‌లో చిక్కుకుపోయిన అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా వెనక్కి పంపుతున్న విషయం విదితమే.(కరోనా: భారత్‌ నుంచి 444 మంది స్వదేశాలకు)

మరిన్ని వార్తలు