‘అయోధ్య’ రివ్యూ పిటిషన్ల కొట్టివేత

13 Dec, 2019 05:11 IST|Sakshi

వీటికి ఎలాంటి అర్హత లేదన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగిపోయింది. నవంబర్‌ 9వ తేదీన వెలువరించిన చారిత్రక తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లన్నిటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. తీర్పు సమీక్ష కోరుతూ దాఖలైన మొత్తం 19 పిటిషన్లకు ఎలాంటి విచారణార్హత లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘రివ్యూకోసం దాఖలైన పిటిషన్లను, జత చేసిన పత్రాలను క్షుణ్నంగా పరిశీలించాం. వీటికి ఎలాంటి ప్రాతిపదిక లేదని భావిస్తున్నాం.

అందుకే ఈ పిటిషన్లన్నిటినీ తిరస్కరిస్తున్నాం’ అంటూ వాస్తవ కక్షిదారులు వేసిన 10 పిటిషన్లను కొట్టివేస్తూ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ఈ ధర్మాసనం పేర్కొంది. తీర్పుపై సమీక్ష కోరేందుకు అనుమతించాలంటూ మూడోపక్షం(థర్డ్‌ పార్టీ) దాఖలు చేసిన 9 పిటిషన్లను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. ఇందులోని 10 పిటిషన్లు వాస్తవ కక్షిదారులవి కాగా, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, దాని మద్దతుతో వేసినవి 8, హక్కుల కార్యకర్తలు 40 మంది కలిసి వేసిన మరో పిటిషన్‌ ఉన్నాయి. వీటితోపాటు అఖిల భారత హిందూ మహాసభ వేసిన పిటిషన్, నిర్మోహి అఖాడా వేసిన రివ్యూ పిటిషన్‌ కూడా తిరస్కరణకు గురయ్యాయి.
 
ఆఖరి చాన్స్‌ ‘క్యూరేటివ్‌’
అన్ని రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టు తిరస్కరణకు గురికావడంతో కక్షిదారులకు ఇక ఒకే ఒక్క అవకాశం మిగిలి ఉంది. అదే క్యూరేటివ్‌ పిటిషన్‌. తీర్పులో ఏవైనా లోపాలున్నాయని అత్యున్నత న్యాయస్థానం భావించిన పక్షంలో వాటిని సవరించేందుకు క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. పునస్సమీక్షకు తగిన ఆధారాలున్నాయని న్యాయస్థానం భావించినా, విచారణ చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు