నిర్భయ కేసు : పిటిషనర్‌కు సుప్రీం చురకలు

20 Jan, 2020 15:30 IST|Sakshi

పవన్‌ గుప్తా పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : నిర్భయ కేసు దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలో.. దోషుల్లో ఒకరైన పవన్‌ కుమార్‌ గుప్తా మరోసారి సుప్రీం కోర్టు తలుపు తట్టాడు. నిర్భయ ఉదంతం చోటుచేసుకునే నాటికి తాను మైనర్‌ను అని అపెక్స్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. ఈమేరకు పవన్‌కుమార్‌ గుప్తా తరపు న్యాయవాది సమర్పించిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. పిటిషనర్ వాదన నిజమని నమ్మడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. కింది కోర్టు పరిశీలనకు వెళ్లి, తిరస్కరణకు గురైన అంశాన్ని మళ్లీ లేవనెత్తడం సరికాదని హితవు పలికింది. ఒకే అంశంపై ఎన్నిసార్లు వాదిస్తారని చురకలు వేసింది.  కాగా, ఇదే విషయమై పవన్‌కుమార్‌ గుప్తా సమర్పించిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
(చదవండి : సోనియా అంత మనసు లేదు)

కోర్టును తప్పుదోవ పట్టించేందుకే..
పిటిషనర్‌ తరపు న్యాయవాది ఏపీ సింగ్‌ వాదనలు వినిపిస్తూ.. నిర్భయ ఉదంతం జరిగే నాటికి పవన్‌ గుప్తా మైనరేనని అతని పాఠశాల డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోందని అన్నారు. వాటిని ఏ కోర్టు కూడా పట్టించుకోవడం లేదని వెల్లడించారు. కాగా, ఏపీ సింగ్‌ వాదనపై  సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పదించారు. ఏపీ సింగ్‌ సమర్పించిన స్కూల్‌ డాక్యుమెంట్లను న్యాయస్థానాలు పరిశీలించాయని, అవన్నీ కోర్టులను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని స్పష్టం చేశారు. నిర్భయ ఘటన జరిగే నాటికి పవన్‌ గుప్తా 19 ఏళ్ల వయసువాడని కోర్టుకు తెలిపారు. బర్త్‌ సర్టిఫికేట్‌, స్కూల్‌ సర్టిఫికేట్లు పవన్‌ మేజరేనన్న విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని కోర్టుకు తెలిపారు. 
(చదవండి : నిర్భయ నేరస్తులకు ఉరితో రేప్‌లకు చెక్‌!)
(చదవండి : ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు )

మరిన్ని వార్తలు