పద్మావతికి ఊరట.. వారిపై సుప్రీం ఆగ్రహం

28 Nov, 2017 12:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్‌పుత్‌ వర్గీయుల వ్యతిరేకతతో తీవ్ర వివాదాల్లో చిక్కుకున్న ‘పద్మావతి’  సినిమాకు ఊరట లభించింది. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ‘పద్మావతి’ సినిమా విడుదలపై సెన్సార్‌ బోర్డు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ‘పద్మావతి’ సినిమాను తెరకెక్కించినందుకు దర్శక, నిర్మాతలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను సైతం న్యాయస్థానం కొట్టివేసింది. ఈమేరకు అర్థంలేని వ్యాజ్యం వేసినందుకు పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది.

‘పద్మావతి’ సినిమాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం సుప్రీంకోర్టు మందలించింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి.. సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ) సర్టిఫై చేయకముందే ఒక సినిమాపై ఎలా వ్యాఖ్యలు చేస్తారని తప్పుబట్టింది. సినిమా విడుదల కాకముందే ఎలా తీర్పు చెప్తారని నేతలను సుప్రీంకోర్టు నిలదీసింది. ఇలా తీర్పు చెప్పడం వల్ల సీబీఎఫ్‌సీ బోర్డు నిర్ణయం ఇది ప్రభావం చూపే అవకాశముందని, ఈ విషయంలో నేతలు చట్టాలు, నిబంధనలకు కట్టుబడి వ్యవహరించాలని సూచించింది.

ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాను ఇప్పటికే మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు నిషేధించాయి. ఈ సినిమాపై ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. రాణి పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ’పద్మావతి’ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమాను నిషేధించాలంటూ జోరుగా రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లావుద్దీన్‌ ఖిల్జీల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్‌లు ఆరోపిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు భన్సాలీ, టైటిల్‌ రోల్‌ పోషించిన దీపికా పదుకోన్‌లను చంపేస్తామని, వారి తలలు నరికితే.. నజరానాలు ఇస్తామని బెదిరింపులకు దిగారు. అయితే, తమ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని భన్సాలీ ఇప్పటికే ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్‌సింగ్‌గా షాహీద్‌ కపూర్, అల్లా వుద్దీన్‌ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు