ఇప్పటికైనా ఈసీ మేలుకుంది : సుప్రీం

16 Apr, 2019 15:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, బీఎస్పీ చీఫ్‌ మాయావతి సహా ఇతరులపై ఈసీ చేపట్టిన చర్యల పట్ల సుప్రీం కోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. తన ఎన్నికల ప్రచారంపై ఈసీ విధించిన 48 గంటల నిషేధ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మాయావతి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ నిరాకరించింది.

ఈసీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా విడిగా అప్పీల్‌ చేసుకోవాలని ఆమె న్యాయవాదికి సూచించింది. ఈసీ ఇప్పటికైనా మేలుకొని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వివిధ నేతల ప్రచారానికి చెక్‌ పెట్టడం సముచితమని ఈసీ చర్యలను సుప్రీం కోర్టు స్వాగతించింది. నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం కోర్టు అక్షింతలతో ఈసీ సోమవారం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, మాయావతి, ఆజం ఖాన్‌, కేంద్ర మం‍త్రి మేనకా గాంధీలపై చర్యలు చేపట్టింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కులం, మతం​ప్రాతిపదికన వ్యాఖ్యలు చేసే రాజకీయ నేతలపై చర్యలు చేపట్టాలని ఈసీని ఆదేశించాలని కోరుతూ ఎన్‌ఆర్‌ఐ యోగ టీచర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు చేపట్టిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు