ఆ కేసును డేగకళ్లతో పరిశీలిస్తాం: సుప్రీం

20 Sep, 2018 03:32 IST|Sakshi

హక్కుల కార్యకర్తల గృహనిర్బంధం కేసు

న్యూఢిల్లీ: కోరెగావ్‌–భీమా అలర్లకు సంబంధించి గృహనిర్బంధంలో ఉన్న ఐదుగురు హక్కుల కార్యకర్తలపై ఆరోపణలు వచ్చిన కేసును డేగ కళ్లతో పరిశీలిస్తామని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. వ్యతిరేకత–అసమ్మతిలకు, సమాజంలో కల్లోలం సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించే చర్యలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుందని మహరాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలియజెప్పింది. హక్కుల కార్యకర్తలు వరవరరావు, అరుణ ఫెరీరా, వెర్నన్‌ గోన్సాల్వెజ్, సుధ భరద్వాజ్, గౌతమ్‌ నవ్‌లఖలను భీమా–కోరెగావ్‌ కేసులో తొలుత అరెస్టు చేసి అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో గృహనిర్బంధంలో ఉంచడం తెలిసిందే.

వారి గృహ నిర్బంధం బుధవారంతో ముగుస్తున్నందున సుప్రీంకోర్టు గడువును మరోరోజు పొడిగించింది. ‘అసమ్మతి, వ్యతిరేకతలను కూడా పరిగణలోకి తీసుకునేలా మన ప్రజాస్వామ్య వ్యవస్థలు దృఢంగా ఉండాలి. అది ఈ న్యాయస్థానమైనా సరే. ఊహలు, కల్పనల కారణంగా స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడటాన్ని మేం సహించం’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాయిబాబా పేరుతో కథలు అల్లారు మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా పేరును వాడుకుని ఐదుగురు హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా పోలీసులు కథలు అల్లుతున్నారని కొందరు ప్రముఖులు సుప్రీంకోర్టుకు తెలిపారు.

మరిన్ని వార్తలు