భీమా–కోరెగావ్‌ కేసులో పోలీసులకు ఊరట

30 Oct, 2018 05:37 IST|Sakshi

అభియోగపత్రం దాఖలుకు డిసెంబర్‌ 1 వరకు గడువిచ్చిన సుప్రీంకోర్టు  

న్యూఢిల్లీ: భీమా–కోరెగావ్‌ అల్లర్ల కేసులో మహారాష్ట్ర పోలీసులకు సుప్రీంకోర్టు సోమవారం ఊరటనిచ్చింది. ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేసేందుకు డిసెంబర్‌ 1 వరకు పోలీసులకు సమయమిచ్చింది. అయితే నిర్దేశిత సమయంలోగా పోలీసులు అభియోగపత్రం దాఖలు చేయలేకపోవడం వల్ల నిందితులకు బెయిల్‌ లభించే వరకు పరిస్థితిని తీసుకురావొద్దని కోర్టు ఆదేశించింది. నేర శిక్షా స్మృతి ప్రకారం తీవ్రమైన నేరారోపణలున్న కేసులు నమోదైన 90 రోజుల్లోపు పోలీసులు అభియోగపత్రాన్ని దాఖలు చేయలేకపోతే అరెస్టైన నిందితులకు బెయిలు లభిస్తుంది.

భీమా–కోరెగావ్‌ అల్లర్ల కేసుకు సంబంధించి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, నాగ్‌పూర్‌ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు సోమ సేన్, దళిత హక్కుల కార్యకర్త సుధీర్‌ ధావలే, సామాజిక కార్యకర్త మహేశ్‌ రౌత, కేరళకు చెందిన రోనా విల్సన్‌లను ఈ ఏడాది జూన్‌లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్‌ 2 నాటికి 90 రోజుల గడువు ముగియడంతో హక్కుల కార్యకర్తలకు బెయిలు రాకుండా ఉండేందుకు పుణేలోని ప్రత్యేక కోర్టు అభియోగపత్రాన్ని దాఖలు చేసేందుకు పోలీసులకు మరో 90 రోజుల గడువిచ్చింది.

హక్కు ల కార్యకర్తలు హైకోర్టుకు వెళ్లడంతో పుణే కోర్టు ఉత్తర్వులను బాంబే హైకోర్టు కొట్టేసింది. దీంతో పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించి తమకు మరింత సమయం కావాలనీ, అప్పటి వరకు నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో పుణే కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది.  
 

మరిన్ని వార్తలు