వీవీప్యాట్లపై ఈసీకి సుప్రీం నోటీసులు

16 Mar, 2019 02:05 IST|Sakshi

25లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం

కేంద్ర ప్రభుత్వానికి కూడా

సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎం)పై అనుమానాలు ఉన్న నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 50 శాతం వీవీ ప్యాట్‌ పత్రాలను ఈవీఎంలతో సరిపోల్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. 6 జాతీయ పార్టీలు, 15 ప్రాంతీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు, ముఖ్యనేతలు కలిపి మొత్తం 21 మంది ఈ పిటిషన్‌ వేశారు. త్రిసభ్య ధర్మాసనం మార్చి 25వ తేదీలోగా కౌంటర్‌ దాఖలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కేసు విచారణకు సహకరించేందుకు ఒక ప్రతినిధిని పంపాలని కూడా ఎన్నికల సంఘాన్ని కోరింది.

పిటిషనర్ల తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ అభిషేక్‌ మను సింఘ్వీ వాదించారు. లోక్‌సభ పరిధిలోని ఏదైనా ఒక అసెంబ్లీ స్థానంలోని వీవీప్యాట్‌లను ఈవీఎంలతో సరిపోల్చేలా ఉన్న ఎన్నికల సంఘం నిబంధనను పక్కనబెట్టి, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 50 శాతం వీవీప్యాట్‌లతో ఈవీఎంల ఫలితాలను తనిఖీ చేసేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. పిటిషనర్లలో ఎస్‌పీ నేత అఖిలేష్, కాంగ్రెస్‌ నేత వేణుగోపాల్, ఆప్‌ నేత కేజ్రీవాల్, టీఎంసీ నేత డెరెక్‌ , టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, సీపీఎం నేత టీకే రంగరాజన్,ఎన్సీ నేత ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి, తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ తదితరులు ఉన్నారు.  
 

మరిన్ని వార్తలు