ఇలా అయితే.. శ్వాసించడం ఎలా?

16 Nov, 2019 03:30 IST|Sakshi
ఢిల్లీలోని ‘ఆక్సిజన్‌ బార్‌’లో సుగంధ ద్రవ్యాలు కలిపిన ఆక్సిజన్‌ను పీలుస్తున్న ఓ మహిళ

ఢిల్లీ కాలుష్య నియంత్రణకు సరిబేసి విధానం సరిపోదన్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇక్కడి ప్రజలు శ్వాస ఎలా తీసుకోవాలని ప్రభుత్వాన్నిఆగ్రహంగా ప్రశ్నించింది. కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యల వివరాలతో నవంబర్‌ 25న తమ ముందు హాజరు కావాలని ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ల చీఫ్‌ సెక్రటరీలను ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యం అత్యధికంగా ఉన్న 13 ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు వారంరోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించింది. స్వచ్ఛ వాతావరణం ఉన్న ఢిల్లీని చూడలేమా? అని ప్రశ్నించింది.

నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం పాటిస్తున్న ‘వాహనాల సరి – బేసి’ విధానం సరిపోదని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. ఆ విధానం ఒక అసంపూర్ణ పరిష్కారమని అభిప్రాయపడింది. ఈ విధానం ద్వారా ఢిల్లీలో కాలుష్యం తగ్గిందా? అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ విధానంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను మినహాయించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు లెక్కల ప్రకారం ఢిల్లీలో కార్ల వల్ల ఏర్పడుతున్న కాలుష్యం కేవలం 3 శాతమేనని ప్రస్తావించింది. ‘సరి బేసి విధానం అమల్లో ఉన్నప్పటికీ..  కాలుష్యం భారీగా పెరుగడం మనం చూశాం.

ఈ విధానం శాశ్వత పరిష్కారం కాదు. ఢిల్లీ, ఎన్సీఆర్‌ ప్రాంతంలో అత్యంత తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం చేరింది. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి’ అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ దీపక్‌గుప్తాల ధర్మాసనం వ్యాఖ్యా నించింది. కాలుష్య స్థాయిని తగ్గించడంలో సరి బేసి విధానం విఫలమైందని కాలుష్య నియంత్రణ బోర్డు అధ్యయనంలో తేలిందని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఏఎన్‌ఎస్‌ నాదకర్ణి కోర్టు కు తెలిపారు. ఈ వాదనను ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ఖండించారు. సరి బేసి విధానం అమల్లో ఉన్న సమయంలో కాలుష్య స్థాయిలు 5% నుంచి 15% వరకు తగ్గాయని వాదించారు.
 

మరిన్ని వార్తలు