పీఎం కేర్స్‌ ఫండ్‌పై పిల్‌.. రేపు విచారణ

12 Apr, 2020 17:00 IST|Sakshi

న్యూఢిల్లీ :  పీఎం కేర్స్‌ ఫండ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కరోనాపై పోరులో భాగంగా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కేర్స్‌ ఫండ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పీఎం కేర్స్‌ ఫండ్‌ భారీగా విరాళాలు ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి మోదీ ఎక్స్‌ అఫిషియో చైర్మన్‌గా ఉండగా, రక్షణ, ఆర్థిక, హోం మంత్రులు ఎక్స్‌ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు. ప్రధాని పిలుపుతో సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు సైతం పీఎం కేర్స్‌ ఫండ్‌ పెద్ద ఎత్తున విరాళాలు పంపిస్తున్నారు.  

అయితే పీఎం కేర్స్‌ ఫండ్‌ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ లాయర్‌ ఎంఎల్‌ శర్మ సుప్రీం కోర్టులో పిల్‌ను దాఖలు చేశారు. ‘మార్చి 28వ తేదీన కోవిడ్‌-19 పోరాటంలో భాగంగా ప్రజలు విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రధానిమోదీ పిలుపునిచ్చారు. ఇందు కోసం పీఎం కేర్స్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవలకు సాయం అందించడానికి ఈ నిధులను వినియోగిస్తామని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 267, 266(2) ప్రకారం ఈ ట్రస్టును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆర్టికల్‌ 267 ప్రకారం దీనిని పార్లమెంట్‌ గానీ, రాష్ట్ర శాసనసభ గానీ రూపొందించలేదు. అలాగే దీనికి పార్లమెంట్‌ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదం లేదు’ అని పిల్‌లో పేర్కొన్నారు. అలాగే ఇప్పటివరకు ఈ ఫండ్‌ కింద సేకరించిన విరాళాలను కాన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియా బదిలీ చేయాలని కోరారు. కాగా, ఈ పిల్‌పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎంఎం శాంతనగౌదర్‌లతో కూడిన ధర్మాసం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టనుంది. 

>
మరిన్ని వార్తలు