‘టిక్‌టాక్‌’ విచారణ ఏప్రిల్‌ 15కు వాయిదా    

9 Apr, 2019 20:53 IST|Sakshi

న్యూఢిల్లీ: టిక్‌టాక్‌పై నిషేధం విధించాలంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసులో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలను వినిపించారు. మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలు.. భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయని సింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు. అయితే ఈ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌.. తదుపరి విచారణను ఏప్రిల్‌ 15కి వాయిదా వేశారు. టిక్‌టాక్‌పై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలంటూ గత వారం కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. టిక్‌టాక్‌ అశ్లీలతను పెంపొందించడమే కాకుండా.. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందంటూ మదురైకి చెందిన సీనియర్‌ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తుకుమార్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రానికి సూచించింది. ఈ యాప్‌ ద్వారా రూపొందించిన వీడియోల ప్రసారంపై మీడియాకు మార్గదర్శకాలు జారీ చేసింది.   

మరిన్ని వార్తలు