మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై వైఖరేంటి?

17 Apr, 2019 03:18 IST|Sakshi

కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ప్రార్థనలకు అనుమతించే విషయంలో వైఖరి వెల్లడించాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ విషయమై పుణేకు చెందిన యాస్మీన్‌ జుబేర్‌ అహ్మద్‌ పీర్జాదే, జుబేర్‌ అహ్మద్‌ నజీర్‌ అహ్మద్‌ పీర్జాదే అనే మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ల ధర్మాసనం మంగళవారం విచారించింది. ‘శబరిమలలోకి మహిళల ప్రవేశంపై మేమిచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ పిటిషన్‌ను స్వీకరిస్తున్నాం. మరోవిధంగా అయితే, మీరు మాకు సరైన సమాధానాలు ఇవ్వలేరు’ అని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14లోని సమానత్వపు హక్కు మరో వ్యక్తి నుంచి పొందేందుకు కూడా వర్తిస్తుందా? మసీదులో ప్రభుత్వ పాత్ర ఎక్కడుంది? అని ధర్మాసనం ప్రశ్నించగా.. దేశంలోని మసీదులకు ప్రభుత్వ సాయం, గ్రాంట్లు అందుతున్నాయని పిటిషనర్‌ సమాధానం ఇచ్చారు.

మసీదులోకి రానివ్వడం లేదంటూ తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బదులిచ్చారు. మహిళలను మసీదుల్లోకి రానివ్వవద్దంటూ మత గ్రంథాల్లో లేదని, పవిత్ర మక్కాతోపాటు కెనడాలోని మసీదుల్లోకి మహిళలు ప్రవేశించి ప్రార్థనాలు చేసుకునే వీలుందని పిటిషనర్‌ తెలిపారు. సౌదీలో మసీదులోకి మహిళల ప్రవేశంపై ఫత్వా ఉందన్నారు. కొన్ని చోట్ల మహిళలను లోపలికి అనుమతిస్తున్నా వారికి వేరుగా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. మనం దేశంలోని సున్నీల్లోనే మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఉందని తెలిపారు. పురుషులతోపాటు మహిళలు మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు గల రాజ్యాంగ హక్కు కల్పించాలని కోరారు. పిటిషనర్‌ వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్రంతోపాటు న్యాయశాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖ, జాతీయ మహిళా కమిషన్, మహారాష్ట్ర వక్ఫ్‌ బోర్డ్, సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌లకు కూడా నోటీసులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు