పౌరహక్కుల నేతల అరెస్ట్‌పై నేడు సుప్రీంలో విచారణ

29 Aug, 2018 14:27 IST|Sakshi

న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతల అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. పౌరహక్కుల నేతల అరెస్ట్‌ను ఖండిస్తూ.. ప్రమఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అరెస్ట్‌ చేసిన ఐదుగురు పౌరహక్కుల నేతలను వెంటనే విడుదల చేయాలని కోరారు. వారిపై తప్పుడు చార్జీషీట్‌లు మోపారాని.. దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం మధ్యాహ్నం 3.45 గంటలకు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. 

గతేడాది డిసెంబర్‌ 31న పుణెకి సమీపంలోని కోరెగావ్‌-భీమా గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో విరసం నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్‌ గొంజాల్వెజ్‌, అరుణ్‌ ఫెరీరా, ఫరీదాబాద్‌లో ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్‌, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అలాగే గౌతం నవలఖా తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన సొంత పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టనుంది. 

మరిన్ని వార్తలు