రాఫెల్‌ వివాదం: వచ్చే వారం సుప్రీం విచారణ

5 Sep, 2018 12:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌, ఫ్రాన్స్‌ల మధ్య కుదిరిన రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందం నిలిపివేతను కోరుతూ దాఖలైన పిటిషన్‌పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు బుధవారం సర్వోన్నత న్యాయస్ధానం అంగీకరించింది. ఫ్రాన్స్‌తో జరిగిన ఈ ఒప్పందంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై స్టే విధించాలని కోరుతూ న్యాయమూర్తి ఎంఎల్‌ శర్మ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం కన్విల్కార్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్‌ అంగీకరించింది. రాఫెల్‌ డీల్‌లో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా ప్రైవేట్‌ కంపెనీకి లబ్ధి చేకూరేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరించిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో దేశ ప్రజలకు తెలియచెప్పేందుకు రాఫెల్‌ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. మోదీ తన క్రోనీ క్యాపిటలిస్ట్‌ స్నేహితుల కోసం భారీ అవినీతికి ఊతమిస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు