విచారణ వాయిదా వేసిన ధర్మాసనం

23 Aug, 2019 13:25 IST|Sakshi

చిదంబరం అరెస్ట్‌ అప్రజాస్వామ్యం: సిబాల్‌

పూర్తి ఆధారాలున్నాయి: ఈడీ

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి చిదంబరం అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఆయన తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం వాడివేడి వాదనలు జరిగాయి. చిదంబరాన్ని నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీలోకి తీసుకోవడం పూర్తిగా అప్రజాస్వామ్యమని ఆయన తరఫు లాయర్లు అన్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందంటూ న్యాయస్థానంలో వాదించారు. చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్ద చేయాలని న్యాయవాది కపిల్‌ సిబాల్‌ ధర్మాసనాన్ని కోరారు. వారి వాదనలు విన్న న్యాయమూర్తి.. చిదంబరం కస్టడీని నిలిపివేయాంటూ ఉత్తర్వులు ఇవ్వలేమనీ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

కాగా విచారణలో భాగంగా ఈడీ అనేక తప్పిదాలకు పాల్పడిందని, సహజ న్యాయసూత్రాలను కూడా పాటించలేదని సిబాల్‌  న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ఆయన్ని అరెస్ట్‌ చేశారని, ఈడీ ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు  కాపీ కొట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా చిదంబరం నేరానికి పాల్పడ్డట్లు తమ వద్ద సరైన ఆధారాలు ఉన్నాయని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు నివేధించారు. కాగా ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరాన్ని బుధవారం రాత్రి సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు ఆయన్ని అధికారులు ప్రశ్నించనున్నారు. 


 

>
మరిన్ని వార్తలు