లాక్‌డౌన్‌ సమస్యలపై సుప్రీం విచారణ

29 Apr, 2020 01:28 IST|Sakshi

పూర్తి వేతనం చెల్లించాలన్న ఉత్తర్వులపై కేంద్రానికి నోటీసులు

‘ఒక దేశం– ఒక రేషన్‌కార్డు’ విధానాన్ని పరిశీలించాలని సూచన

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడి లక్ష్యంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో తలెత్తిన కొన్ని సమస్యలకు సుప్రీంకోర్టు పరి ష్కారాలు సూచించింది. లాక్‌డౌన్‌ సమయానికి పూర్తి వేతనాలు చెల్లించాలన్న కేంద్రం ఉత్తర్వుతోపాటు, వలస కార్మికులకు లబ్ధి చేకూర్చేలా ‘ఒకే దేశం–ఒకే రేషన్‌ కార్డు’విధానాన్ని తాత్కాలికంగానైనా అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని వీడియో కాన్ఫ రెన్స్‌ ద్వారా జరిగిన విచారణలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్, జస్టిస్‌ బి.ఆర్‌. గవాయిల ధర్మాసనం కోరింది. దీంతోపాటు కోవిడ్‌–19 సమస్య లేని ప్రాంతాల్లోని వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ కిట్లు)అందించే విషయాన్ని పరిశీలించాలని సూచించింది.

లాక్‌డౌన్‌ కాలానికి ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలన్న కేంద్రం ఉత్తర్వులను కొట్టివేయాలంటూ కొన్ని ప్రైవేట్‌ సంస్థలు సుప్రీంకోర్టును అభ్యర్థించాయి.  ఈ పిటిషన్‌పై తీర్పు వెలువడేలోగా ఉద్యోగులకు 50 శాతం వేతనాలు మాత్రమే చెల్లించేందుకు అనుమతించాలని నాగ్రీకా ఎక్స్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ తదితర సంస్థలు కోరాయి. లాక్‌డౌన్‌తో పరిశ్రమలన్నీ మూతపడటంతో భారీ నష్టాలు చవిచూశామని తెలిపాయి. ఈ పిటిషన్‌పై జవాబిచ్చేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు రెండు వారాల గడువిచ్చింది.

ఏకీకృత రేషన్‌కార్డుల జారీపై ..
లాక్‌డౌన్‌ సమయంలో తాత్కాలికంగానైనా దేశం మొత్తమ్మీద ఒకే రకమైన రేషన్‌ కార్డు ద్వారా పేదలకు నిత్యావసరాలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. దీంతోపాటు, కోవిడ్‌–19పై పోరాడుతున్న వారికి మాత్రమే కాకుండా.. ఇతర ప్రాంతాల్లోని వైద్య సిబ్బందికి కూడా వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) కిట్లు అందించేలా మార్గదర్శకాలను మార్చాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది.

మరిన్ని వార్తలు