రెబల్‌ ఎమ్మెల్యేలకు రిలీఫ్‌

23 Sep, 2019 17:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో 15 అసెంబ్లీ స్ధానాలకు జరిగే ఉప ఎన్నికల్లో తమను కూడా పోటీకి అనుమతించాలని కోరుతూ అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం అంగీకరించింది. వీరి పిటిషన్‌కు సంబంధించి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ సహా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రెబెల్‌ ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురవడంతో ఖాళీ అయిన 15 అసెంబ్లీ స్ధానాల్లో వచ్చే నెల 21న జరిగే ఉప ఎన్నికల్లో తమనూ పోటీకి అనుమతించాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 25న విచారణ చేపడతామని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది. మరోవైపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్‌ జారీ ఉత్తర్వులు వారిని ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించలేవని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. రెబెల్‌ ఎమ్మెల్యేలను స్పీకర్‌ అనర్హులుగా ప్రకటించడంతో హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌) సంకీర్ణ సర్కార్‌ పతనమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు